ఐర్లాండ్ తో జరిగిన రెండో టీ ట్వంటీలో పలు రికార్డులు నమోదయ్యాయి. ఓపెనర్ గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దీపక్ హుడా సెంచరీతో రెచ్చిపోయాడు. సంజూ శాంసన్ తో కలిసి పరుగుల వరద పారించాడు. ఈ మ్యాచ్ లో భారత్ భారీస్కోర్ చేసిందంటే వీరిద్దరి పార్టనర్ షిప్పే కారణం. ఆకాశమే హద్దుగా చెలరేగిన హుడా కేవలం 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
దీపక్ హుడాకు ఓపెనర్ సంజూ శాంసన్ కూాడా చక్కని సపోర్ట్ ఇచ్చాడు. శాంసన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 176 పరుగుల రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పారు. తద్వారా టీ ట్వంటీల్లో భారత్ తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఈ క్రమంలో 2017లో శ్రీలంకపై రోహిత్, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు జోడించిన 165 రన్స్ రికార్డును హుడా-శాంసన్ జోడీ బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ లో శతకం చేసిన దీపక్ హుడా వ్యక్తిగతంగానూ అరుదైన రికార్డ్ అందుకున్నాడు.
టీ ట్వంటీల్లో సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్ గా దీపక్ హుడా నిలిచాడు. ఇంతకుముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనాలు మాత్రమే అంతర్జాతీయ టీ ట్వంటీల్లో సెంచరీలు చేశారు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో దూరమవడంతో ఓపెనర్ గా ప్రమోషన్ దక్కించుకున్న హుడా సెంచరీతో చెలరేగిపోవడం భారత్ కు భారీస్కోరు అందించింది. టీ ట్వంటీ ప్రపంచకప్ కు జట్టును ఎంపిక చేసే సమయం దగ్గర పడుతున్న వేళ దీపక్ హుడా సూపర్ ఫామ్ తో కోచ్ ద్రావిడ్ కు కొత్త తలనొప్పి మొదలైంది. పలువురు యువ క్రికెటర్లు షార్ట్ ఫార్మాట్ లో సత్తా చాటుతుండడంతో జట్టు ఎంపిక విషయంలో ద్రావిడ్ తర్జన భర్జన పడుతున్నాడు.