DeKock: ఛేజింగ్ లో సౌతాఫ్రికా వరల్డ్ రికార్డ్… సఫారీలదే రెండో టీ ట్వంటీ

టీ ట్వంటీ అంటేనే పరుగుల వరద...ఇక పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటే బ్యాటర్లకు పండుగే.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన టీ ట్వంటీలో పరుగుల వరద పారింది.

  • Written By:
  • Updated On - March 26, 2023 / 11:08 PM IST

DeKock:  టీ ట్వంటీ అంటేనే పరుగుల వరద…ఇక పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటే బ్యాటర్లకు పండుగే.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మధ్య సెంచూరియన్ వేదికగా జరిగిన టీ ట్వంటీలో పరుగుల వరద పారింది. బౌలర్లకు పీడకలను మిగిల్చిన ఈ మ్యాచ్ లో 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. బౌలర్ బంతిని వేయడమే ఆలస్యం దాని కేరాఫ్ అడ్రస్ బౌండరీ అవతలే అన్నట్టుగా సాగింది. రెండు జట్లలో స్టార్ బ్యాటర్లు పూనకం వచ్చినట్టు రెచ్చిపోయారు. 10 ఓవర్లకు 137… 16 ఓవర్లకు 206…20 ఓవర్లకు 258 పరుగులు… ఇదీ విండీస్ స్కోర్ సాగిన క్రమం.. దీనిని చూస్తేనే కరేబియన్ బ్యాటర్ల విధ్వంస కాండ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ మూడో బంతికే వికెట్ కోల్పోయిన విండీస్ రెండో వికెట్ మళ్ళీ 137 పరుగుల దగ్గర పడింది. కైల్ మేయర్స్ , ఛార్లెస్ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు. ముఖ్యంగా ఛార్లెస్ సఫారీ బౌలర్లను ఆటాడుకున్నాడు. ఫలితంగా విండీస్ స్కోర్ టాప్ గేర్ లో సాగింది. ఛార్లెస్ కేవలం 39 బంతుల్లోనే శతకం సాధించాడు. టీ ట్వంటీల్లో ఇది ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. చార్లెస్ 48 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లతో 118 పరుగులు చేయగా… మేయర్స్ 51 రన్స్ చేశాడు. ఛార్లెస్ సెంచరీ ఇన్నింగ్స్ లో 106 పరుగులు బౌండరీలు, సిక్సర్ల ద్వారానే వచ్చాయి. చివర్లో పావెల్ , షెపార్డ్ కూడా చెలరేగి ఆడారు. షెపార్డ్ కేవలం 18 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లంతా ఓవర్ కు 15కు పైగా పరుగులు సమర్పించుకున్నారు. విండీస్ కు టీ ట్వంటీల్లో ఇదే అత్యధిక స్కోర్. విండీస్ ఇన్నింగ్స్ లో 22 సిక్సర్లు నమోదయ్యాయి.

బ్యాటింగ్ పిచ్ కావడంతో సౌతాఫ్రికా కూడా చెలరేగిపోయింది. తొలి బంతి నుంచే బౌండరీలతో హోరెత్తించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ రెచ్చిపోయాడు. విండీస్ బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. డికాక్ జోరుకు సౌతాఫ్రికా పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 102 పరుగులు చేసింది. ఈ క్రమంలో డికాక్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో ఇది నాలుగో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. సౌతాఫ్రికా తరపున ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. భారీ టార్గెట్‌ను సునాయాసంగా ఛేదించేలా ఆడిన సౌతాఫ్రికా 14 ఓవర్లలోనే 200 మార్క్‌ను అందుకుంది. తొలి వికెట్‌కు హెండ్రిక్స్, డికాక్ 10.5 ఓవర్లలోనే 152 పరుగులు జోడించారు. డికాక్ 43 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి ఔటయ్యాడు. కాసేపటికే హెండ్రి క్స్ 28 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులకు వెనుదిరిగాడు. తర్వాత రొస్కు 16 , మిల్లర్ 10 పరుగులకే ఔటవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ దశలో సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్‌రమ్ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. ఈ సఫారీ సారథి కేవలం 21 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 259 పరుగుల టార్గెట్‌ను మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో ఇదే అత్యధిక పరుగుల ఛేదన. ఈ మ్యాచ్‌లో మొత్తం 35 సిక్సర్లు, 46 ఫోర్లు నమోదయ్యాయి.