IPL 2022 : కీలక పోరులో విజయమెవరిదో ?

ఐపీఎల్ 15వ సీజన్ సెకండాఫ్ కూడా మొదలైపోయింది. దీంతో ఇక్కడ నుంచి ప్రతీ జట్టుకూ ప్రతీ మ్యాచ్ కీలకమే. పాయింట్ల పట్టికలో సెకండాఫ్ లో ఉన్న జట్లకు ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డైగానే చెప్పాలి.

  • Written By:
  • Updated On - April 28, 2022 / 11:58 AM IST

ఐపీఎల్ 15వ సీజన్ సెకండాఫ్ కూడా మొదలైపోయింది. దీంతో ఇక్కడ నుంచి ప్రతీ జట్టుకూ ప్రతీ మ్యాచ్ కీలకమే. పాయింట్ల పట్టికలో సెకండాఫ్ లో ఉన్న జట్లకు ప్రతీ మ్యాచ్ డూ ఆర్ డైగానే చెప్పాలి. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఏ ఒక్క అవకాశం వదులుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్ , కోల్ కతా నైట్ రైడర్స్ తలపడబోతున్నాయి. వాంఖేడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకూ కీలకమే. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉండగా.. కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితే కాస్త బెటర్ గా ఉందని చెప్పొచ్చు. కోల్ కతా 8 మ్యాచ్ లలో 3 విజయాలు సాధించగా.. ఢిల్లీ 7 మ్యాచ్ లలో 3 విజయాలను అందుకుంది. దీంతో ప్లే ఆఫ్ అవకాశాల ఈ మ్యాచ్ నుంచే ఇరు జట్లకూ ప్రభావితం కానున్నాయి.

గత మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో పరాజయం పాలైంది. వివాదాస్పద నో బాల్ నేపథ్యంలో ఢిల్లీ కెప్టెన్ పంత్ కూడా జరిమానాకు గురయ్యాడు. ఈ ఓటమి నుంచి తేరుకున్న ఢిల్లీ , కోల్ కతాను నిలువరించేందుకు సన్నద్ధమైంది. అయితే ఢిల్లీ తుది జట్టు కూర్పు ఆసక్తిగా మారింది. విదేశీ ప్లేయర్లు అందుబాటులో లేకపోవడంతో గత మ్యాచ్ లో ముగ్గురితోనే ఆడాల్సి వచ్చింది. కాగా కరోనా నుంచి కోలుకున్న ఆ జట్టు స్టార్లు మిచెల్ మార్ష్, టిమ్ సీఫెర్ట్ ప్రాక్టీసు సెషన్లో జాయిన్ అవడం ఆ జట్టుకు ఊరటనిస్తోంది. అయితే వీరిద్దరూ నేటి మ్యాచ్‌కు వారు అందుబాటులో ఉండడం డౌటే. ఒకవేళ ఉంటే గనుక సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో మిచెల్ మార్ష్‌ను దించే వీలుంది. పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ ఫామ్ అడ్వాంటేజ్ గా చెప్పుకున్నా… మిగిలిన బ్యాటర్లు రాణించాల్సి ఉంది. కెప్టెన్ రిషబ్ పంత్ ఈ సీజన్ లో చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ ఆడలేదు. అటు బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ రాణిస్తుండగా… ముస్తఫిజర్ స్థానంలో నోర్జేను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది.

మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. ఆ జట్టుకు ఇంకా ఆరు మ్యాచ్ లే మిగిలి ఉండగా… ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా ఐదింటిలో గెలవాల్సిందే. దీంతో వరుసగా 4 పరాజయాలతో సతమతమవుతున్న కోల్ కతా ఈ మ్యాచ్ తోనైనా గెలుపు బాట పడుతుందేమో చూడాలి. వెంకటే్శ్ అయ్యర్ ఫామ్ కోల్ కతాకు ఆందోళన కలిగిస్తోంది. గత సీజన్ లో పరుగుల వరద పారించిన అయ్యర్ ఈ సారి మాత్రం నిరాశపరుస్తున్నాడు. దీంతో అయ్యర్ స్థానంలో రహానేను తీసుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. బిల్లింగ్స్ కూడా ఆకట్టుకోలేకపోతుండగా.. ఫించ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్సుంది. ఇక కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ పేలవ ఫామ్ కూడా కోల్ కతా పరాజయాలకు మరో కారణం. దీంతో కీలక బ్యాటర్లు రాణిస్తే తప్ప ఢిల్లీని ఓడించడం నైట్ రైడర్స్ కు కష్టమే. రస్సెల్ మ్యాచ్ ఫినిషింగ్ ఇన్నింగ్స్ ఆడలేకపోతుండడం మరో మైనస్ పాయింట్. అటు బౌలింగ్ లో అంచనాలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తి ఘోరంగా విఫలమవుతున్నాడు. ఢిల్లీ బ్యాటర్లకు కళ్ళెం వేయాలంటే కోల్ కతా బౌలర్లు సమిష్టిగా రాణించాల్సిందే. ఇక పిచ్ విషయానికొస్తే వాంఖేడే స్టేడియంలో ఛేజింగ్ కే ఎక్కువ అవకాశముంటుంది. దీంతో మరోసారి టాస్ కీలకం కానుంది.