David Warner : వార్నర్ కు ఐపీఎల్ కెప్టెన్సీ కష్టమే

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు ఇప్పటికే ఏఏ ఆటగాళ్ళను తీసుకోవాలనే దానిపై వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
David Warner

David Warner

ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు ఇప్పటికే ఏఏ ఆటగాళ్ళను తీసుకోవాలనే దానిపై వ్యూహరచనలో బిజీగా ఉన్నాయి. పలువురు స్టార్ ప్లేయర్స్ కోసం ఈ సారి గట్టిపోటీనే నెలకొంటుందని తెలుస్తోంది. సన్ రైజర్స్ మాజీ కెప్టెన్ , ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కోసం పలు ఫ్రాంచైజీలు ఖచ్చితంగా ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో వార్నర్ గురించి రోజుకో వార్త వైరల్ అవుతోంది.
ఈ విధ్వంసకర ఓపెనర్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోనుగోలు చేస్తుందన్న వార్తలు వస్తుండగా… ఆ జ‌ట్టు కెప్టెన్సీ భాధ్య‌త‌లు కూడా అప్ప‌గించే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు, ప్రముఖ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో డేవిడ్ వార్నర్ కేవలం ఆటగాడిగానే కొనసాగుతాడని , ఏ ఫ్రాంచైజీ కూడా
అతన్ని కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశం లేదని వ్యాఖ్యానించాడు. ఆర్సీబీ, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లు అతన్ని కేవలం ఓపెనర్‌గానే చూస్తాయని చెప్పాడు. వార్నర్ భారీ ధరకు అమ్ముడుపోయే ఛాన్స్ ఉందని , వేలంలో అతని కోసం అన్ని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తాయనన్నాడు. వార్నర్ ఒక అత్యద్భుతమైన ఆటగాడనడంలో ఏ మాత్రం సందేహం లేదన్నాడు. అయితే వార్నర్‌ను కెప్టెన్‌గా తీసుకోవాలని ఏ జట్టు యాజమాన్యం భావించడం లేదని అభిప్రాయపడ్డాడు.కేవలం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గానే పరిగణలోకి తీసుకుంటాయని చెప్పుకొచ్చాడు. వార్నర్ కు వేలంలో 15 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుందని ఆకాశ్ చోప్రా జోస్యం చెప్పాడు. కెరీర్ లో ఇప్పటి వరకూ 150 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్.. 5,449 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలున్నాయి. గత ఏడాది సన్ రైజర్స్ వార్నర్ ను కెప్టెన్సీ నుండి తప్పించడంతో పాటు తుది జట్టులోనూ ఆడించలేదు.

  Last Updated: 29 Jan 2022, 02:13 PM IST