Site icon HashtagU Telugu

Rohit Sharma : రోహిత్ అద్భుతమైన కెప్టెన్ : సామి

T20 World Cup 2024

Rohit Sharma

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్నప్పటి నుండీ కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపికపై చాలా మంది మంచి నిర్ణయంగానే అభివర్ణించారు. ప్రస్తుతం జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ళలో రోహిత్ కీలకమని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నింటికీ మించి ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను అద్భుతంగా లీడ్ చేస్తూ ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిపాడు. కెప్టెన్సీ పరంగా విరాట్ స్థానంలో రోహిత్ సరైన వాడేనని అభిప్రాయపడ్డారు. తాజాగా రోహిత్ శర్మ కెప్టెన్సీపైనా, కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ పైనా విండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత క్రికెట్ సురక్షితమైన చేతుల్లోనే ఉందంటూ వ్యాఖ్యానించాడు. కోహ్లీ మైదానంలో అసాధారణరీతిలో జట్టుని నడిపించాడని, ఇప్పుడు అతను వైదొలిగినప్పటికీ.. జట్టుపై ఆ ప్రభావం ఉండబోదన్నాడు. ఎందుకంటే కోహ్లీ స్థానంలో ఎంపికైన రోహిత్ శర్మ కూడా అద్భుతమైన కెప్టెన్ అని చెప్పాడు. ముంబయి ఇండియన్స్ జట్టులో ఆటగాళ్లని సారథిగా అతను ప్రోత్సహించడాన్నితాను చూసానని గుర్తు చేసుకున్నాడు. ధోనీ, గంభీర్ తరహాలో అతనూ కెప్టెన్‌గా మ్యాచ్‌లను గెలిపించగలడని జోస్యం చెప్పాడు.. సహచరుల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టడం,. ట్రోఫీలు ఎలా గెలవాలో వీరికి తెలుసన్నాడు. అలాగే కోచ్ గా ద్రావిడ్ నియామకం టీమిండియాకు మరింత మేలు చేస్తుందని ఈ విండీస్ మాజీ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రానున్న సిరీస్ లో వెస్టిండీస్ ను ఓడించడం భారత్ కు అంత సులభం కాదని సామి అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల ఫార్మేట్ లో ముఖ్యంగా టీ ట్వంటీల్లో విండీస్ బాగానే ఆడుతుందన్నాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో పెద్దగా ఆకట్టుకోపోయినప్పటికీ తమ జట్టు తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించాడు. ఐపీఎల్ ఆడడం ద్వారా భారత్ లో పరిస్థితులకు పొల్లార్డ్ తో పాటు జట్టులో ఉన్న పలువురు ఆటగాళ్ళు బాగా అలవాటు పడ్డారని చెప్పాడు. కాగా ఫిబ్రవరి 1న భారత్ పర్యటనకు రానున్న కరేబియన్ టీమ్ మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీలు ఆడనుంది. వన్డే సిరీస్ అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6 నుండి మొదలవుతుంది. అనంతరం టీ ట్వంటీ సిరీస్ కు కోల్ కతా ఆతిథ్యమిస్తోంది.

Exit mobile version