Dada@50: గంగూలీ @ 50

భారత క్రికెట్‌లో దూకుడుకు కేరాఫ్ అడ్రస్‌...ప్రత్యర్థుల కవ్వింపులకు ఆటతోనే కాదు మాటతోనే సమాధానం చెప్పేలా భారత జట్టుకు నేర్పించిన ఘనత అతని సొంతం.

  • Written By:
  • Updated On - July 8, 2022 / 02:08 PM IST

భారత క్రికెట్‌లో దూకుడుకు కేరాఫ్ అడ్రస్‌…ప్రత్యర్థుల కవ్వింపులకు ఆటతోనే కాదు మాటతోనే సమాధానం చెప్పేలా భారత జట్టుకు నేర్పించిన ఘనత అతని సొంతం..పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా చివరి వరకూ పోరాడాలన్న సంస్కృతి నేర్పిన వ్యక్తి.. అతనెవరో కాదు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ..కెప్టెన్‌గా జట్టుకు ప్రపంచకప్‌ అందించలేకపోయినా ఎన్నో చారిత్రక విజయాలు మాత్రం అందించాడు. భారత క్రికెట్‌లో దూకుడైన కెప్టెన్‌గా అందరినీ ఆకట్టుకున్న గంగూలీ నేడు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత జట్టును నడిపించడం అంటే అంత సులభం కాదు. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం ఒక ఎత్తయితే… దానిని నిలబెట్టుకోవడం…మనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయడం గంగూలీకే చెల్లింది. అసలు భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన సారథి గంగూలీనే. స్లెడ్జింగ్‌కు మారుపేరుగా ఉండే ఆస్ట్రేలియా మాటలకు ధీటుగా బదులిచ్చిన కెప్టెన్ ఎవరైనా ఉన్నారంటే అది దాదానే. మైదానంలో ఆటపరంగా తన దాదాగిరీనే జట్టులో ప్రతీ ఒక్కరికీ నేర్పించాడు. హర్భజన్, యువీ, కైఫ్, జహీర్‌ఖాన్ లాంటి ఆటగాళ్ళు గంగూలీ హయాంలో వెలుగులోకి వచ్చినవారే. లార్డ్స్ బాల్కనీలో నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచిన తర్వాత చొక్కా విప్పిన సీన్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేరు.

ప్రపంచ క్రికెట్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా తొలి అడుగులు వేయించింది దాదానే. సారథిగా పగ్గాలు అందుకుంటూనే యువ ఆటగాళ్లను వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాదు వారిని మ్యాచ్ విన్నర్లుగా తయారు చేసాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్ళ అహంభావాన్ని పలుసార్లు దెబ్బకొట్టింది ఘనత దాదాకే దక్కుతుంది. టాస్ కోసం ప్రత్యర్థి కెప్టెన్లను ఎదురుచూసేలా చేయడం ఆసీస్ అప్పటి సారథి స్టీవ్‌వాకు అలవాటు. అలాంటిది ఒకసారి స్టీవ్‌వాను చాలాసేపు టాస్ కోసం వేచి చూసేలా చేసిన ధైర్యం గంగూలీదే. ఉద్ధేశపూర్వకంగానే టాస్‌కు ఆలస్యం వచ్చానంటూ సూటిగా చెప్పి స్టీవ్‌వాకు షాకిచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే దూకుడుగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక గంగూలీ బ్యాటింగ్‌లో కొన్ని సిగ్నేచర్ షాట్లు ఎప్పటికీ ప్రత్యేకమే.

ఫ్రంట్‌ఫుట్‌కు వచ్చి బౌలర్ తలమీదుగా కొట్టిన సిక్సర్లు ఇప్పటికీ ఫ్యాన్స్ వీక్షిస్తూ ఉంటారు. ఈ షాట్లు వేరే బ్యాటర్లు కొట్టినా…దాదా స్టైల్ మాత్రం ఇప్పటికీ ప్రత్యేకంగా నిలిచింది. రిటైర్మెంట్ తర్వాత అడ్మినిస్ట్రేటర్‌గా తనదైన ముద్ర వేస్తున్న గంగూలీ బీసీసీఐ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం లండన్‌లో టీమిండియా మ్యాచ్‌లు వీక్షిస్తున్న గంగూలీ, తన సహచరుడు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇంకా బీసీసీఐ సెక్రటరీ జైషా, రాజీవ్‌శుక్లా, తన కుటుంబసభ్యులతో కలిసి 50వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నాడు. లండన్‌లో వీరంతా దాదా బర్త్‌డే పార్టీలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు, ప్రముఖులు దాదాకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు.