CWG Indian Hockey: 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో కాంస్యం

టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించే అవకాశం తృటిలో కోల్పోయిన భారత మహిళల హాకీ జట్టు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకం కలను నెరవేర్చుకుంది.

  • Written By:
  • Publish Date - August 7, 2022 / 10:25 PM IST

టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించే అవకాశం తృటిలో కోల్పోయిన భారత మహిళల హాకీ జట్టు కామన్‌వెల్త్ గేమ్స్‌లో పతకం కలను నెరవేర్చుకుంది.
సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్ టెక్నికల్ తప్పిదం కారణంగా ఓడిపోయిన భారత్‌ కాంస్య పతక పోరులో సత్తా చాటింది. హై డ్రామా మధ్య షూటౌట్‌కు దారితీసిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. తద్వారా 16 ఏళ్ళ తర్వాత కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మెడల్ అందుకుంది.
మొదటి క్వార్టర్‌లోనే సలీమా తేటే గోల్ చేసి 1-0 తేడాత భారత్‌కు ఆధిక్యం అందించింది. ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో ఇరు జట్ల ప్లేయర్లు గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. ఆఖరి నాలుగో క్వార్టర్ చివర్లో మాత్రం హై డ్రామా నడిచింది. మరో 18 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా న్యూజిలాండ్ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. దీంతో మ్యాచ్ ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. పెనాల్టీ షూటౌట్‌లో
భారత్ మహిళల జట్టు రెండు గోల్స్ చేయగా.. న్యూజిలాండ్‌ ఒక గోల్‌కే పరిమితమైంది. ఈ విజయంతో సుధీర్ఘ నిరీక్షణ తర్వాత కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల హాకీ జట్టు పతకం సాధించింది. 2002లో స్వర్ణం గెలవగా… 2006లో రజతం సాధించింది. మళ్ళీ 16 ఏళ్ళ తర్వాత మహిళల హాకీలో భారత్‌కు పతకం దక్కింది. టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరు చూపించినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత మహిళా హాకీ జట్టు, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్లు పొరపాట్ల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది.