Site icon HashtagU Telugu

CWG GOLD: అమిత్, నీతూ గోల్డెన్ పంచ్‌

Boxing Gold Imresizer

Boxing Gold Imresizer

కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మహిళల విభాగంలో నీతూ, పురుషుల విభాగంలో అమిత్ పంఘల్ స్వర్ణాలు కైవసం చేసుకున్నారు. అంచనాలకు తగ్గట్టు రాణించిన వీరిద్దరూ తుది మ్యాచ్‌లలో పూర్తి ఆధిపత్యం కనబరిచారు. 45- 48 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన నీతూ…. కెనడా బాక్సర్ రెజ్టన్ ను 5-0 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది. నీతూ పంచ్‌ల ముందు ప్రత్యర్థి బాక్సర్ పూర్తి తేలిపోయింది.

ఏ దశలోనూ పోటీనివ్వలేకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్‌గా ముగిసింది. రెండు సార్లు వరల్డ్ యూత్ మెడల్స్‌ గెలిచిన నీతూకి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్. కామన్వెల్త్ గేమ్స్ 2022 సెలక్షన్ సమయంలో భారత సీనియర్ బాక్సర్ మేరీ కోమ్ గాయపడడంతో 21 ఏళ్ల నీతూ గంగాస్‌కి అవకాశం దక్కింది. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్న నీతూ గంగాస్, మేరీ కోమ్‌ లేని లోటును పసిడి పతకంతో తీర్చేసింది. మరోవైపు పురుషుల విభాగంలో అమిత్ పంగల్ గోల్డెన్ పంచ్ విసిరాడు. 51 కేజీల విభాగంలో ఫైనల్ చేరిన అమిత్ ఫైనల్ పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. ఇంగ్లాండ్ ప్లేయర్ మెక్ డొనాల్డ్ ను 5-0 తేడాతో ఓడించి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. గత కామన్వెల్త్ గేమ్స్ లో అమిత్ పంఘల్ సిల్వర్ గెలుచుకోగా… ఈ సారి స్వర్ణం సాధించాడు. మరో మ్యాచ్‌లో భారత బాక్సర్ రోహిత్ కాంస్య పతకం దక్కించుకున్నాడు. బాక్సింగ్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. వారికి విషెస్ చెబుతూ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

Exit mobile version