CSK vs RCB: హై స్కోరింగ్ క్లాష్ లో చెన్నైదే విక్టరీ

ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా ఐపీఎల్ అంటే... బ్యాటర్లు చెలరేగిన వేళ...బౌలర్లు ప్రేక్షకులుగా మిగిలిన వేళ..చిన్నస్వామి స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయింది.

  • Written By:
  • Publish Date - April 17, 2023 / 11:42 PM IST

CSK vs RCB: ఇది కదా మ్యాచ్ అంటే…ఇది కదా ఐపీఎల్ అంటే… బ్యాటర్లు చెలరేగిన వేళ…బౌలర్లు ప్రేక్షకులుగా మిగిలిన వేళ..చిన్నస్వామి స్టేడియం పరుగుల వర్షంలో తడిసి ముద్దయింది. ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చిన ఏ పోరులో చెన్నై 8 రన్స్ తేడాతో విజయం సాధించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కేకు ఆర్‌సీబీ పేసర్ మహమ్మద్ సిరాజ్ గట్టి షాకిచ్చాడు. తన రెండో ఓవర్‌లోనే సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఔట్ చేశాడు. అయితే అజింక్యా రహానే డేవాన్ కాన్వే ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడటంతో చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 53 పరుగులు చేసింది.పవర్ ప్లే అనంతరం ధాటిగా ఆడుతున్న రహానేను హసరంగా క్లీన్ బౌల్డ్ చేయడంతో 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి శివమ్ దూబే ,కాన్వేతో కలిసి మెరుపులు మెరిపించాడు. కాన్వే 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు భారీ సిక్సర్‌తో విధ్వంసం మొదలుపెట్టిన దూబే.. భారీ షాట్లతో విరుచుకు పడ్డాడు. ప్రతీ బౌలర్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. కాన్వే సైతం అదే జోరు కొనసాగించడంతో చెన్నై స్కోర్ టాప్ గేర్ లో సాగింది. దూబే 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాన్వే , దూబే ఔటైనా.. రాయుడు, మొయిన్ అలీ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 226 పరుగులు భారీ చేసింది.కాన్వే 45 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 83, శివమ్ దూబే 27 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 52 రన్స్ చేశారు.

భారీ లక్ష్య చేధనలో బెంగుళూరుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆకాష్ సింగ్ కోహ్లీకి ఔట్ చేశాడు. కాసేపటికే లొమరర్ కూడా ఔటవడంతో బెంగుళూరు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ డుప్లేసిస్ , మాక్స్ వెల్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ భారీ షాట్లతో చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డారు. మూడో వికెట్ కు కేవలం 10 ఓవర్లలో 126 పరుగులు జోడించారు. ముఖ్యంగా మాక్స్ వెల్ సిక్సర్లతో రెచ్చిపోయాడు.

ఏకంగా 8 సిక్సర్లు కొట్టాడు. అటు డుప్లేసిస్ కూడా ధాటిగా ఆడడంతో బెంగుళూరు స్కోర్ కూడా టాప్ గేర్ లోనే సాగింది. అయితే డుప్లేసిస్ , మాక్స్ వెల్ ఔట్ అయ్యాక చెన్నై పట్టు బిగించింది. మాక్స్ వెల్ 36 బంతుల్లో 76 , డుప్లేసిస్ 33 బాల్స్ లో 62 రన్స్ చేశారు. తర్వాత దినేష్ కార్తిక్ మెరుపులు మెరిపించినా కీలక సమయంలో వెనుదిరిగాడు. చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభు దేశాయ్ భారీ షాట్లతో ఆశలు రేపినా…చెన్నై బౌలర్ మహేశా అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో మూడో విజయాన్ని అందుకుంది.