Criticism on Suryakumar: బలహీనతలు అధిగమిస్తేనే.. సూర్యకుమార్ వన్డే ఫాం పై విమర్శలు

టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ వన్డే ఫార్మాట్ కు పనికిరాడా.. ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇదే చర్చ నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - March 23, 2023 / 04:48 PM IST

టీ ట్వంటీల్లో నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) వన్డే ఫార్మాట్ కు పనికిరాడా… ప్రస్తుతం ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇదే చర్చ నడుస్తోంది. ఈ సిరీస్ లో ఆడిన మూడు వన్డేల్లోనూ సూర్యకుమార్ యాదవ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. తొలి రెండు వన్డేల్లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ సమర్పించుకున్న సూర్య.. చివరి వన్డేలో ఆగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఏ ఆటగాడూ కోరుకోని చెత్త రికార్డును సాధించాడు. వరుస వైఫల్యాలతో సూర్యకుమార్ బలహీనతలపైనా చర్చ మొదలైంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ ను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడే ఈ స్టార్ బ్యాటర్ మూడో వన్డేలో అదే వీక్ నెస్ తో ఔటయ్యాడు. అంతకుముందు రెండు వన్డేల్లోనూ స్టార్క్ వేసిన ఇన్ స్వింగర్లను ఎదుర్కోలేక వికెట్ల ముందు దొరికిపోయాడు.

వరుసగా మూడు డకౌట్ల నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్‌ (Suryakumar Yadav) పై సోషల్ మీడియా వేదికగా విమర్శల జడివాన కురుస్తోంది. ఐపీఎల్, టీ20 ఫార్మాట్ తప్ప మిగతా ఫార్మాట్లకు అనవసరమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫేక్ 360 అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే వన్డేల్లో సూర్యకి అసలు అనుభవంలేదని, అందుకే కుదురుకునేందుకు అవకాశాలు ఇవ్వాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సూర్యకుమార్ ను వెనకేసుకొచ్చాడు. అతను మూడు బంతులే ఆడాడని, అప్పుడే వన్డేల్లో అతని ఆటతీరును అంచనా వేయలేమన్నాడు. ఈ సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ ప్రదర్శనను ఎలా విశ్లేషించాలో అర్థం కావడం లేదనీ, సిరీస్ గురించి అతడు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిదన్నాడు. స్పిన్నర్లను సూర్యకుమార్ యాదవ్ బాగా ఆడతాడని గుర్తు చేశాడు.

నిజానికి టీ ట్వంటీ ఫార్మాట్ లో మాత్రం దుమ్మురేపే సూర్యకుమార్ వన్డేల్లో ఆడడంపై సరిగా ఫోకస్ పెట్టలేదని తెలుస్తోంది. వన్డేల్లో కాస్త ఓపికతో ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు మ్యాచ్ లో నెలకొన్న పరిస్థితులను అర్థం చేసుకుని క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించకుండా… టీ ట్వంటీ తరహాలో ఆడేస్తే వికెట్ పారేసుకోవడం తప్ప ఇంకేమీ జరగదు. ఇవన్నీ సూర్యకుమార్ కు తెలియనివి కావు.. అయితే టీ ట్వంటీలకు బాగా అలవాటు పడి ఇవన్నీ మరిచిపోయాడేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్ కంటే ముందే సూర్య తన బలహీనతలు అధిగమించకుంటే వన్డే జట్టులో చోటు ఆశించడం కష్టమే. ప్రపంచకప్ కు ఇంకా ఆరు నెలలు ఉందని అనుకోకుండా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ తర్వాత జరిగే వన్డే సిరీస్ లలో కీలక ఆటగాళ్ళకు వరుస అవకాశాలిచ్చి ఫామ్ లోకి తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంది. వన్డే ప్రపంచకప్ కు జట్టు రెడీ అయిపోయిందని ద్రావిడ్ ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో సూర్యకుమార్ బలహీనతలను అధిగమించేలా మరింత ఫోకస్ చేసేలా దృష్టి పెట్టాలి. అవసరం అయితే ఐపీఎల్ లో కొన్ని మ్యాచ్ లకు రెస్ట్ ఇచ్చి వర్క్ లోడ్ ను కూడా మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంది.

Also Read:  Ugadi Horoscope 2023: ఈ కొత్త సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలాంటి ఫలితాలు వస్తాయి?