ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. టోర్నమెంట్‌లోని మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పోర్చుగల్‌ను 1–0తో మొరాకో ఓడించింది. ఈ జట్టు ఓటమితో క్రిస్టియానో రొనాల్డో ప్రపంచకప్ కల కూడా చెదిరిపోయింది. ఫిఫా ప్రపంచకప్ (FIFA World Cup 2022)లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ దేశంగా మొరాకో నిలిచింది. ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో మొరాకో చేతిలో పోర్చుగల్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురైన పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రోనాల్డో (Cristiano Ronaldo) కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరలవుతోంది.
పోర్చుగల్ ఓటమి ఆ జట్టు వెటరన్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై ప్రభావం చూపింది. మ్యాచ్‌లో ఓడిపోవడంతో అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చాడు. రెండో అర్ధభాగం ముగిసే సమయానికి రొనాల్డోకు గోల్ చేసే అవకాశం వచ్చింది. పోర్చుగల్ ఎదురుదాడికి దిగినా రొనాల్డో వేసిన కిక్ నేరుగా గోల్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 38 ఏళ్ల రొనాల్డోకు ఇది 5వ FIFA ప్రపంచకప్. ఒక్కసారి కూడా తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టలేకపోయాడు.
Also Read: PT Usha: పీటీ ఉష సరికొత్త రికార్డు.. IOA తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నిక
సెకండాఫ్‌లో చివరి ఆరు నిమిషాల ఇంజూరీ టైమ్‌లో మొరాకో 10 మందితో ఆడవలసి వచ్చింది. కానీ ప్రపంచ 9వ ర్యాంకర్ పోర్చుగల్ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.యూసఫ్ ఎన్ నెస్రీ హెడర్‌తో మొరాకో మ్యాచ్‌ను గెలుచుకుంది. మ్యాచ్ 42వ నిమిషంలో అతను గోల్ చేశాడు. చివరి నిమిషంలో 10 మందితో ఆడినప్పటికీ మొరాకో పోర్చుగల్‌ను నిలువరించింది. యూసుఫ్ కొట్టిన గోల్‌కు డగౌట్‌లో కూర్చున్న రొనాల్డో ఆశ్చర్యపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్ 51వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రొనాల్డో సహచరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకు సాగాడు. బంతి దొరకడమే ఆలస్యం గోల్‌పోస్ట్ వైపు మెరుపు వేగంతో కదిలాడు. మ్యాచ్‌లో పోర్చుగల్ మూడు సార్లు మొరాకో గోల్‌పోస్ట్‌పై దాడి చేసిన ఫలితం లేకుండా పోయింది. చివరకు మొరాకో విజయం సాధించింది.