Voice Note Row : విండీస్ జట్టులో గొడవలు

వెస్టిండీస్ జ‌ట్టు భార‌త‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది

Published By: HashtagU Telugu Desk
Kieron Pollard

Kieron Pollard

వెస్టిండీస్ జ‌ట్టు భార‌త‌ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నుంది. ఫిబ్రవరి 6న భార‌త్‌- వెస్టిండీస్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది.ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ఇటీవల ప్ర‌క‌టించింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కి గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ ఆ జట్టు ఆల్‌రౌండర్‌ ఓడెన్‌ స్మిత్‌ విషయంలో విద్వేషపూరితతంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్థానిక మీడియాలో  సంచలన ఆరోపణలు వచ్చాయి.  జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో పొలార్డ్.. దారుణంగా వ్యవహరించాడని, పలువురు క్రికెటర్ల మీద వివక్ష చూపుతున్నాడంటూ కథనాలు  ప్రసారమయ్యాయి.

పొలార్డ్ తో పాటు హెడ్ కోచ్ ఫిల్ సిమన్స్ కలిసి ఓడెన్ స్మిత్ ను బలిపశువును చేస్తున్నారని కొన్ని మీడియాలతో పాటు రేడియో జమైకా కూడా కథనాలు ప్రసారం చేసింది. జట్టులో చీలిక తప్పేలా లేదని కూడా పలు ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. అయితే వెస్టిండీస్ జట్టులోవిభేదాలపై క్రికెట్ వెస్టిండీస్ ప్రెసిడెంట్ రిక్కీ స్టేరిట్ స్పందించాడు. కరేబియన్ జ‌ట్టులో ఎలాంటి గొడవలు లేవ‌ని, ఆటగాళ్లు అంద‌రూ కలసికట్టుగానే ఉన్నారని పేర్కొన్నాడు. కెప్టెన్ పొలార్డ్ పై పగసాధించేందుకే కొందరు ఇలాంటి వార్తల్ని సృష్టిస్తున్నారని రిక్కీ స్టేరిట్ చెప్పుకొచ్చాడు.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ పోటీపడుతోంది. ఈ సీరీస్ ముగిసిన మరుసటి రోజే విండీస్ టీ ట్వంటీ జట్టు భారత్ కు బయలుదేరుతుంది.

  Last Updated: 29 Jan 2022, 12:21 PM IST