CSK vs SRH: చెపాక్ లోనూ సన్ రైజర్స్ ఫ్లాప్ షో… చెన్నై ఖాతాలో మరో విజయం

ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడ లేని ఆటతీరు కొనసాగుతోంది. సొంత గడ్డపై ముంబై చేతిలో చిత్తుగా ఓడిపోయిన సన్ రైజర్స్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పైనా ఘోర పరాభవం చవిచూసింది.

  • Written By:
  • Updated On - April 21, 2023 / 11:01 PM IST

CSK vs SRH: ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడ లేని ఆటతీరు కొనసాగుతోంది. సొంత గడ్డపై ముంబై చేతిలో చిత్తుగా ఓడిపోయిన సన్ రైజర్స్ తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ పైనా ఘోర పరాభవం చవిచూసింది. అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం కనబరిచిన చెన్నై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు.

తొలి వికెట్ కి కేవలం 35 పరుగులు జోడించారు. హ్యారీ బ్రూక్ 18 రన్స్ చేయగా… కాసేపు అలరించిన అభిషేక్ శర్మ 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. అతను తప్ప మిగతా బ్యాటర్లు క్రీజులో నిలువలేక పోయారు.
బ్యాటింగ్ ఆర్డర్ లో పలు మార్పులు కూడా సన్ రైజర్స్ ను దెబ్బ తీసినట్టు కనిపిస్తోంది. ఓపెనింగ్ విషయంలో అనవసర ప్రయోగాలు చేస్తున్న హైదరాబాద్ ఈ మ్యాచ్ లో సక్సెస్ కాలేకపోయింది. రాహుల్ త్రిపాఠీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఎయిడెన్ మార్క్రమ్ , హెన్రిక్ క్లాసెన్ విఫలమయ్యారు.

చెన్నై స్పిన్ ఎటాక్ ముందు వీళ్లెవరూ నిలబడలేకపోయారు. కొత్త రోల్‌లో ఫినిషర్‌గా వచ్చిన మయాంక్ అగర్వాల్ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 134 పరుగులకే పరిమితమయింది.చెన్నై బౌలర్లలో జడేజా 3 , పతిరణ 1 , తీక్షన 1 వికెట్ పడగొట్టారు.

టార్గెట్ చిన్నదే అయినా చెన్నై ఓపెనర్లు తొలి బంతి నుంచే ధాటిగా ఆడారు. ఫాంలో ఉన్న కాన్వే , రుతురాజ్ గైక్వాడ్ మరోసారి అదరగొట్టారు. సన్ రైజర్స్ బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపలేక పోవడంతో చూడచక్కని షాట్లతో అలరించారు. తొలి వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఈ క్రమంలో కాన్వే మరో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రుతురాజ్ గైక్వాడ్ 35 రన్స్ కు దురదుష్టవశాత్తూ రనౌట్ కాగా..రహానే 9 పరుగులకు వెనుదిరిగాడు. తర్వాత అంబటి రాయుడు కూడా ఔటవడంతో చెన్నై 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కాన్వే , మొయీన్ అలీ చెన్నై విజయాన్ని పూర్తి చేశారు. చెన్నై మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ అందుకుంది.
కాన్వే 57 బంతుల్లో 12 ఫోర్లు , 1 సిక్సర్ తో 77 రన్స్ తో అజేయంగా నిలిచాడు.ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది నాలుగో విజయం.