Site icon HashtagU Telugu

Sreeshanth: అగ్రెసివ్..వివాదాలు…రీ ఎంట్రీ…

Sreeshanth

Sreeshanth

భారత క్రికెట్ జట్టు వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో మాజీ ఆటగాళ్ళు, ఫాన్స్ విషెస్ చెబుతున్నారు. క్రికెట్ లోని అన్ని రకాల ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు అతడు ప్రకటించిన శ్రీశాంత్ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయం తాను తీసుకున్నానని తన కెరీర్ ఎదుగుదలకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలని చెప్పుకొచ్చాడు.

వివాదాస్పద బౌలర్ గా పేరుతెచ్చుకున్న శ్రీశాంత్ 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో మిస్బా-ఉల్-హక్ క్యాచ్ పట్టడం ఎవరూ మర్చిపోలేరు.. అలాగే శ్రీశాంత్ కెరీర్ లో ఐపిఎల్ లో హర్భజన్ సింగ్ తో గొడవ, మైదానంలో వికెట్ తీసిన ప్రతీ సారి శ్రీశాంత్ చేసుకునే వింత సెలెబ్రేషన్స్ అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పొచ్చు. ఇక కేరళ స్పీడ్ స్టార్ శ్రీశాంత్ టీమిండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 87, వన్డేల్లో 75, టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. అలాగే 44 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 40 వికెట్లు పడగొట్టాడు. ఇక టీమిండియా గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లలో శ్రీశాంత్‌ సభ్యుడు కావడం విశేషం.

అయితే శ్రీశాంత్‌ 2013 ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్‌ ఫిక్సింగ్‌ విషయంలో దోషిగా తేలాడు. దాంతో అతనిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. ఇది శ్రీశాంత్ కెరీర్ లో ఒక మచ్చగా మిగిలిపోయింది. అయితే తన నిషేధంపై సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. సుప్రీం కోర్టు శ్రీశాంత్ నిషేధ కాలాన్ని తగ్గించాలని 2019లో బీసీసీఐని ఆదేశించింది.. దాంతో 2020 సెప్టెంబర్‌ నుంచి శ్రీశాంత్ దేశవాళీ క్రికెట్‌లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇక ఇటీవల జరిగిన ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో శ్రీశాంత్ పాల్గొన్నప్పటికీ ఏ జట్టు అతనిపై ఆసక్తి చూపకపోవడంతో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు.