Commonwealth Games:రేపటి నుంచే కామన్‌వెల్త్‌ గేమ్స్‌

ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా సంబరం కామన్‌వెల్త్ గేమ్స్‌ అభిమానులను అలరించేందుకు మళ్ళీ వచ్చేసింది. జూలై 28 నుంచి ఆగష్ట్ 8 వరకూ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.

  • Written By:
  • Updated On - July 27, 2022 / 05:40 PM IST

ఒలింపిక్స్ తర్వాత అతిపెద్ద క్రీడా సంబరం కామన్‌వెల్త్ గేమ్స్‌ అభిమానులను అలరించేందుకు మళ్ళీ వచ్చేసింది. జూలై 28 నుంచి ఆగష్ట్ 8 వరకూ ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది. 72 దేశాల నుంచి 5 వేల మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రతి నాలుగేళ్లకోసారి జరిగే కామన్‌వెల్త్ గేమ్స్‌కు 9 దశాబ్దాల చరిత్ర ఉంది. బ్రిటీష్ పాలిత దేశాల పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌ను తొలిసారి 1930లో నిర్వహించారు. చివరగా 2018లో ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగాయి. ప్రస్తుతం బర్మింగ్‌హామ్ వేదికగా జరగనున్నవి 22వ కామన్వెల్త్ గేమ్స్.
22వ కామన్వెల్త్ గేమ్స్‌ 2022 జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 72 దేశాల నుంచి 5 వేల మంది అథ్లెట్లు పోటీపడనున్నారు. ఇంత మంది పాల్గొనడం కామన్వెల్త్ చరిత్రలో ఇదే మొదటిసారి. 283 మెడల్ ఈవెంట్లలో క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు. మొదటి సారిగా ఈ పోటీల్లో పురుషుల కంటే మహిళల ఈవెంట్లు ఎక్కువగా ఉన్నాయి. మహిళలు, దివ్యాంగ అథ్లెట్ల కోసం అత్యధిక ఈవెంట్లను నిర్వహించనున్నారు. ఈ సారి కామన్వెల్ గేమ్స్ కోసం ఆతిథ్య ఇంగ్లాండ్ మొత్తం 15 వేదికలను సిధ్ధం చేసింది.
ప్రారంభోత్సవం జులై 28న జరగనుండగా.. ముగింపు వేడుక ఆగస్టు 8న నిర్వహించనున్నారు.

ఈ సారి కామన్వెల్త్ గేమ్స్‌కు యూకే భారీ ఎత్తున ఖర్చు చేసింది. లండన్ ఒలింపిక్స్ తర్వాత అత్యధిక వెచ్చించిన పోటీలు ఇవే. లండన్ ఒలింపిక్స్ కోసం 8 ప్రస్తుత భారత కరెన్సీలో రూ.84 వేల కోట్లు ఖర్చు కాగా.. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్ కోసం 778 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో 7,493 కోట్లు వెచ్చించారు. అథ్లెటిక్స్ ఈవెంట్లకు ఆతిథ్యం ఇచ్చే అలెగ్జాండర్ స్డేడియాన్ని ఆధునీకరించడానికి రెండేళ్లలో 700 కోట్లు ఖర్చు చేశారు. అంతేకాకుండా కొత్తగా అక్వాటిక్స్ సెంటర్‌ను అభివృద్ధి చేశారు. ఇందుకోసం 73 మిలియన్ పౌండ్లు వెచ్చించారు. అటు భద్రతా పరంగానూ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 3 వేల మంది పోలీసులు కామన్‌వెల్త్ గేమ్స్ భద్రతలో భాగం కానున్నారు. ఇదిలా ఉంచే కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైనప్పట్నుంచి ఒక్కసారి కూడా మిస్ కాకుండా ఆడుతున్న దేశాలుగా ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, స్కాట్లాండ్, వేల్స్ నిలిచాయి. కామన్వెల్త్ క్రీడల్లో అత్యధిక పతకాలు గెలిచిన దేశంగా ఆస్ట్రేలియా రికార్డు నెలకొల్పింది. 2018లో ముగిసిన గోల్డ్ కోస్ట్ ఒలింపిక్స్ వరకు ఆ దేశం ఏకంగా 2,415 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో 932 స్వర్ణాలు, 774 రజతాలు, 709 కాంస్య పతకాలున్నాయి. ఈ జాబితాలో ఇంగ్లాండ్ , కెనడా రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. తర్వాత భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.