Site icon HashtagU Telugu

India vs SA : టీమ్‌కు ద్రావిడ్ స్పెషల్ క్లాస్

BCCI Invites Applications

BCCI Invites Applications

ఐపీఎల్ సందడి ముగిసి వారం రోజులైనా కాకమునుపే భారత క్రికెటర్లు మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టేశారు. సౌతాఫ్రికాతో గురువారం నుంచి మొదలుకానున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ గెలవడమే లక్ష్యంగా ప్రాక్టీస్ షురూ చేశారు. టీ ట్వంటీ ప్రపంచకప్‌కు ముందు ఎక్కువ పొట్టి సిరీస్‌లే ఉండడంతో జట్టు కూర్పుపైనే భారత్ దృష్టి పెట్టనుంది. అయితే నాన్‌ స్టాప్ క్రికెట్ ఆడుతున్న కెప్టెన్ రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ ప్లేయర్స్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్‌ కోసం కెఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గానూ, రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గానూ నియమించారు. పలువురు సీనియర్లు లేకున్నా ఐపీఎల్‌లో సత్తా చాటిన యువ ఆటగాళ్ళు సఫారీలతో జరిగే సిరీస్‌లో కీలకం కానున్నారు. తాజాగా ఈ సిరీస్ కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన తొలి ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియోలో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. టీమ్‌ సభ్యులకు సలహాలు, సూచనలు ఇస్తూ కనిపించాడు. ఐపీఎల్‌ కారణంగా రెండు నెలల పాటు టీమ్‌కు దూరంగా ఉన్న ద్రావిడ్ ఈ సిరీస్‌తో మళ్ళీ జట్టుతో కలిసాడు.

ఐపీఎల్‌లో రాణించి జట్టులోకి ఎంపికైన యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు ద్రావిడ్ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సీజన్‌లో వీరిద్దరూ నిలకడగా రాణించడం, తమ పేస్‌తో పలువురు విదేశీ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బందిపెట్టిన సందర్భాలూ ఉన్నాయి. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్‌కు భారత బౌలింగ్‌ను మరింత బలంగా తీర్చిదిద్దేలా సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యువ పేసర్లపై ద్రావిడ్ దృష్టిసారించినట్టు అర్థమవుతోంది. ప్రాక్టీస్ సెషన్‌లో వీరి బౌలింగ్‌ను చాలాసేపు నిశితంగా పరిశీలించిన ద్రావిడ్ పలు కీలక సూచనలు చేశాడు. అటు దినేష్‌ కార్తీక్‌, కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చహల్‌లాంటి సీనియర్లు కూడా చాలా కాలం తర్వాత టీమ్‌లోకి వచ్చారు. వీరందరి ప్రాక్టీస్‌నూ చాలాసేపు పరిశీలించిన ద్రావిడ్ ఆటగాళ్ళందరికీ స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న ఏడాది కావడంతో ఈ సౌతాఫ్రికా సిరీస్‌ నుంచే ప్రాబబుల్స్‌పై కోచ్‌ ద్రవిడ్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు.

Exit mobile version