గేల్ , జాంటీ రోడ్స్‌లకు మోదీ స్పెషల్ మెసేజ్

ప్రపంచ క్రికెట్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్‌కు భారత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

  • Written By:
  • Publish Date - January 27, 2022 / 10:45 AM IST

ప్రపంచ క్రికెట్‌లో పలువురు స్టార్ ప్లేయర్స్‌కు భారత్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. దేశంతో సంబంధం లేకుండా వారిని మన ఫ్యాన్స్ బాగానే అభిమానిస్తారు. అలాంటి వారిలో సౌతాఫ్రికా ఫీల్డింగ్ సెన్సేషన్ జాంటీ రోడ్స్ , విండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ గేల్ ఖచ్చితంగా ఉంటారు. తమ ఆటతో ఇక్కడి అభిమానులను ఆకట్టుకున్న వారికి కాస్త గట్టి రిలేషనే ఉంది. తాజాగా 73వ గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా క్రిస్ గేల్, జాంటీ రోడ్స్‌లకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సందేశం పంపించారు. ఈ విషయాన్ని వీరిద్దరూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రధాని పంపిన లేఖను రోడ్స్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. భారత దేశ ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న కొంతమంది స్నేహితులకు నేను ఈ లేఖ రాస్తున్నాను. భవిష్యత్తులోనూ మీరు భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నా. మీ కుమార్తెకు ఇండియా జెన్సీ రోడ్స్ అని పేరు పెట్టుకున్నారంటే మీకు భారత్‌పై ఉన్న అభిమానం అర్థమవుతోందంటూ మోదీ లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాంటీ రోడ్స్ కూడా మోదీకి ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశాడు.భారత దేశ ప్రజల అభిమానం తననెంతో ఆకట్టుకుందంటూ ప్రశంసించాడు.

అటు గేల్ కూడా తన సోషల్ మీడియా అకౌంట్‌లో మెసేజ్ చేశాడు. భారతప్రధాని నరేంద్ర మోదీ పంపిన పర్సనల్‌ మెసేజ్‌తో ఈరోజు ఉదయాన్నే మేల్కొన్నాను… 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న భారతీయులందరికి ఇవే నా శుభాకాంక్షలు. నరేంద్ర మోదీతో పాటు భారత దేశ ప్రజలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది. మీ అందరికి యునివర్సల్‌ బాస్‌ శుభాకాంక్షలు చెబుతున్నాడు అంటూ ట్వీట్‌ చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , పంజాబ్‌ కింగ్స్‌ తరఫున క్రిస్‌ గేల్‌ బరిలోకి దిగాడు. అయితే త్వరలో జరగనున్న ఐపీఎల్ ఆటగాళ్ళ మెగా వేలానికి గేల్ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో గేల్‌ తన పేరును నమోదు చేసుకోలేదు.