Chris Gayle: ఐపీఎల్ లో నన్ను అవమానించారు

ఏ టీ ట్వంటీ లీగ్ అయినా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ లేకుండా ఆ లీగ్ ను ఊహించలేం.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 12:33 PM IST

ఏ టీ ట్వంటీ లీగ్ అయినా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ లేకుండా ఆ లీగ్ ను ఊహించలేం. అసలు టీ ట్వంటీ ఫార్మాట్ అంటేనే గేల్ విధ్వంసకర బ్యాటింగ్ కు చిరునామా. ఇక ఎన్నో ఏళ్ల పాటు ఐపీఎల్‌ను డామినేట్‌ చేసిన చరిత్ర క్రిస్‌ గేల్‌ది. 30 బాల్స్‌లోనే సెంచరీ కొట్టినా.. భారీ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడినా.. నిమిషాల్లో మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసినా అది ఈ విండీస్ హిట్టర్ కే సాధ్యం. అలాంటి ఐపీఎల్‌పై ఇప్పుడు గేల్‌ మండిపడుతున్నాడు. తనకు తగినంత గౌరవం దక్కకపోవడం వల్లే తాను ఐపీఎల్‌ 2022 నుంచి తప్పుకున్నట్లు తాజాగా వెల్లడించాడు.

ఓ అంతర్జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గేల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లుగా ఐపీఎల్‌ జరిగిన విధానం చూస్తే.. తనను అవమానించినట్లుగా కనిపించిందన్నాడు. తనకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని, ఐపీఎల్‌కు, ఆటకు ఎంతో చేసిన తర్వాత కూడా దక్కాల్సిన గౌరవం దక్కలేదనిపించిందనీ గేల్ వ్యాఖ్యానించాడు. ఈ కారణంగానే ఇక వేలంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అందుకే ఐపీఎల్ ను ఎలా వదిలేసాననీ చెప్పాడు. క్రికెట్‌ కాకుండా కూడా జీవితం ఉందనీ , ఇప్పుడు తాను దానినే ఎంజాయ్‌ చేస్తున్నట్లు గేల్‌ చెప్పాడు.

ఈ విండీస్ హిట్టర్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, పంజాబ్‌ కింగ్స్‌ టీమ్స్‌కు ఆడాడు. అయితే ఎక్కువగా ఆర్సీబీ తరఫునే అతడు మెరుపులు మెరిపించాడు. 2021 ఎడిషన్‌లో గేల్‌ పంజాబ్‌ కింగ్స్‌ తరఫున 10 మ్యాచ్‌లు ఆడినా పెద్దగా రాణించలేకపోయాడు. అంతకుముందు 2020 సీజన్‌లో అయితే కేవలం 7 మ్యాచ్‌లే ఆడాడు. అప్పుడు జరిగిన వేలంలో ఫ్రాంఛైజీలు అతనిపై పెద్దగా ఆసక్తి చూపకపోతే.. పంజాబ్‌ కింగ్స్‌ రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌కు అతన్ని దక్కించుకుంది. ఈ లీగ్‌లో మొత్తం 142 మ్యాచ్‌లు ఆడిన గేల్‌.. 4965 రన్స్‌ చేశాడు. అయితే ఈ మధ్య కాలంలో మరో ఇంటర్వ్యూలో తాను 2023 ఐపీఎల్‌కు తిరిగి వస్తున్నట్లు గేల్‌ చెప్పాడు. అయితే తాజాగా గేల్ ఐపీఎల్ పై విమర్శలు చేయడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.