Pujara@200: పుజారా మరో ”డబుల్”

భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా కౌంటీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు.

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 10:21 AM IST

భారత టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర పుజారా కౌంటీ క్రికెట్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. గత ఏడాది భారత జట్టులో చోటు కోల్పోయిన తర్వాత కౌంటీ క్రికెట్ ఆడి రీ ఎంట్రీ ఇచ్చిన పుజారా ఇంగ్లీష్ గడ్డపై తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ కు ముందు అద్భుతంగా రాణించిన పుజారా తాజాగా డబుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ప్రస్తుతం ససెక్స్‌ జట్టుకు స్టాండింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పుజారామిడిలెసెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. 368 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న పుజారాకు ససెక్స్‌ తరపున ఈ ఏడాది ఇది మూడో డబుల్‌ సెంచరీ. కాగా ఈ క్రమంలో పుజారా అరుదైన రికార్డును బ్రేక్ చేశాడు.

118 ఏళ్లలో సింగిల్‌ కౌంటీ డివిజన్‌లో ససెక్స్‌ తరపున మూడు డబుల్‌ సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ససెక్స్‌ తరపున డెర్బీషైర్‌తో మ్యాచ్‌లో తొలి డబుల్‌ సెంచరీ మార్క్‌ అందుకున్న పుజారా.. ఆ తర్వాత డుర్హమ్‌తో మ్యాచ్‌లో రెండో డబుల్ సాధించాడు. తాజాగా మిడిలెసెక్స్‌తో మ్యాచ్‌లో మూడో ద్విశతకం అందుకున్నాడు. అలాగే కౌంటీల్లో మిడిల్‌సెక్స్‌ ప్రత్యర్థిగా అత్యధిక స్కోరు సాధించిన భారత ఆటగాళ్లలో పుజారా 231 రన్స్ తో తొలి స్థానంలో నిలిచాడు. పుజారా తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ , రవిశాస్త్రి, అబ్దుల్‌ ఖాదీర్ , పియూష్‌ చావ్లా ఉన్నారు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దీంతో కౌంటీలు ఆడేందుకు వెళ్లి ససెక్స్‌ తరపున సెంచరీలు, డబుల్‌ సెంచరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ తో మ్యాచ్ కు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో పుజారా 231 పరుగులకు ఔటవగానే ససెక్స్‌ ఇన్నింగ్స్‌ 523 పరుగుల వద్ద ముగిసింది.