Site icon HashtagU Telugu

Cheteshwar Pujara : క్రికెట్‌కి వీడ్కోలు పలికిన ఛతేశ్వర్‌ పుజారా

Cheteshwar Pujara bids farewell to cricket

Cheteshwar Pujara bids farewell to cricket

Cheteshwar Pujara : టీమిండియాకు అనేక విజయాలను అందించిన టెస్ట్ క్రికెట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన ఓర్పు, సహనం, క్రీజులో కూర్చునే శైలి వల్ల టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన పుజారా, అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. 15 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ఆయన ముగింపు పలకడం క్రికెట్ ప్రపంచాన్ని కాస్త కలిచివేసిందనే చెప్పాలి. పుజారా తన రిటైర్మెంట్ గురించి సామాజిక మాధ్యమ వేదిక ‘X’లో పేర్కొంటూ భారత జెర్సీ ధరించి ఆడే అవకాశం నాకు కలిగిన ప్రతిసారీ గర్వంగా ఫీలయ్యా. దేశం కోసం నా శాయశక్తులా ప్రదర్శించేందుకు ప్రయత్నించా. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ సంఘం, మిగతా జట్లు, ఫ్రాంచైజీలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని భావోద్వేగభరితంగా పేర్కొన్నారు.

ఇటీవలి వరకు రంజీ ట్రోఫీలో తిరిగి బరిలోకి దిగే ఆసక్తిని వ్యక్తపరిచిన పుజారా, అక్టోబర్‌లో మొదలయ్యే సీజన్‌లో పాల్గొననున్నట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరిలో ముగిసిన గత సీజన్ తర్వాత పుజారా మళ్లీ పోటీ క్రికెట్‌కి వస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడిలా రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ నిర్ణయానికి గల అసలు కారణం ఏమిటన్నది స్పష్టంగా తెలియలేదు. గత కొన్ని నెలలుగా భారత జట్టులో చోటు దక్కకపోవడం, యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశం ఇవ్వడం వంటి విషయాలే ఈ నిర్ణయానికి కారణమా? లేక ఇతర వ్యక్తిగత కారణాలా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అజింక్య రహానె ముంబై కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కొన్ని గంటల్లోనే పుజారా ఈ నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

2008లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన పుజారా, తన కెరీర్‌లో 103 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 7000కి పైగా పరుగులు చేశాడు. ఓపెనర్‌గా, నెంబర్ 3 స్థానం నుంచి భారత జట్టుకు స్థిరతను ఇచ్చిన పుజారా, విదేశీ గడ్డపై అనేక మ్యాచ్‌లను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా పర్యటనల్లో చేసిన అద్భుతమైన ప్రదర్శనలు ఇప్పటికీ అభిమానుల మనసుల్లో నిలిచిపోయాయి. పుజారాకు క్రికెట్ అభిమానుల నుండి, మాజీ క్రికెటర్ల నుండి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. భారత క్రికెట్‌లో అతని పాత్రను, కృషిని ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తర్వాత కోచింగ్, మెంటోరింగ్ వంటి బాధ్యతలవైపు అడుగులు వేయనున్నారా? లేదా ఏదైనా క్రికెట్ లీగ్‌లలో కొనసాగనున్నారా? అన్నది ఆసక్తికరమైన అంశం. ఏదైతేనేం, టెస్ట్ క్రికెట్‌కు తనదైన ముద్ర వేసిన పుజారా సేవలు భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. భారత జెర్సీకి గౌరవం తీసుకువచ్చిన ఈ ఆటగాడికి భవిష్యత్‌కు శుభాకాంక్షలు.