Site icon HashtagU Telugu

Asia Cup: ఆసియా క‌ప్ గెలిచిన భార‌త్‌.. కానీ ట్రోఫీ ఎక్క‌డా?

Asia Cup 2025 Trophy

Asia Cup 2025 Trophy

Asia Cup: దుబాయ్‌లో జరిగిన ఏసీసీ ఆసియా కప్ 2025 (Asia Cup) ఫైనల్‌లో పాకిస్తాన్‌పై టీమ్ ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచినప్పటికీ వారికి ట్రోఫీ దక్కకపోవడం క్రికెట్ ప్రపంచంలో పెద్ద వివాదానికి తెర తీసింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛీఫ్, ఏసీసీ అధ్యక్షుడు మోహసిన్ నఖ్వి నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించడంతో బహుమతి ప్రదానోత్సవం రసాభాసగా మారింది.

బీసీసీఐ కఠిన వైఖరి

ట్రోఫీ ప్రజంటేషన్ విషయంలో నఖ్వి పట్టుబట్టడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) తమ వైఖరిని కఠినతరం చేసింది. “ఏసీసీ ఛైర్మన్, ఆయన పాకిస్తాన్ ముఖ్య నాయకులలో ఒకరు కాబట్టి ఆయన నుంచి ట్రోఫీ తీసుకోకూడదని మేము నిర్ణయించుకున్నాము. కాబట్టి మేము దానిని అతని నుండి అంగీకరించము” అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ ఘటనను క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా భావించిన భారత్.. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వద్దకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది.

“ట్రోఫీ, పతకాలు వీలైనంత త్వరగా భారతదేశానికి తిరిగి వస్తాయని మేము ఆశిస్తున్నాము. నవంబర్ మొదటి వారంలో దుబాయ్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో ఏసీసీ ఛైర్‌పర్సన్ చర్యపై తీవ్రంగా నిరసన నమోదు చేస్తాము” అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 45 నిమిషాల ప్రతిష్టంభన తర్వాత, భారత్ కేవలం స్పాన్సర్‌లు అందించిన వ్యక్తిగత అవార్డులను మాత్రమే స్వీకరించి, ట్రోఫీని తిరస్కరించింది.

Also Read: Arattai App: ట్రెండింగ్‌లో అరట్టై.. ఈ యాప్ సీఈవో సంపాద‌న ఎంతో తెలుసా?

మోదీ సందేశంపై నఖ్వి అనుచిత వ్యాఖ్యలు

వివాదం మరింత ముదరడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందన సందేశానికి మోహసిన్ నఖ్వి ఇచ్చిన స్పందనే కారణం. మోదీ చేసిన ట్వీట్‌కు (‘‘ఆపరేషన్ సిందూర్‌ క్రీడా మైదానంలో కూడా ఫలితం అదే – భారత్ గెలుస్తుంది!’’) నఖ్వి యుద్ధం, క్రీడల రాజకీయాలను జోడిస్తూ అనుచిత సమాధానం ఇచ్చారు. “క్రీడల్లోకి యుద్ధాన్ని లాగడం కేవలం నిస్సత్తువనే బహిర్గతం చేస్తుంది” అంటూ ఆయన పోస్ట్ చేశారు.

రాబోయే కీలక సమావేశాలు

ఈ ట్రోఫీ ప్రతిష్టంభన ఇప్పుడు క్రికెట్ బోర్డుల వేదికలకు చేరింది. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 3:30 గంటలకు (ఐఎస్టీ) దుబాయ్‌లో జరగబోయే ఏసీసీ అత్యవసర సమావేశంలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. బీసీసీఐ ఒత్తిడి కారణంగా జూలై 24న ఢాకాలో వాయిదా పడిన ఏజీఎం అంశాలు కూడా మళ్లీ తెరపైకి రానున్నాయి. నవంబర్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేయనుంది.

టాస్ సమయంలోనూ పాకిస్తాన్ తమ ప్రతినిధి ఉండాలని పట్టుబట్టడంతో రవిశాస్త్రితో పాటు వకార్ యూనిస్‌ను కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రోఫీ ప్రజంటేషన్ సమయంలో రాజీ కుదిర్చేందుకు ఈసీబీ, బీసీబీ అధ్యక్షులు ట్రోఫీని అందజేయాలని ప్రతిపాదించినా నఖ్వి ఏసీసీ చీఫ్‌గా అది తన హక్కు అని పట్టుబట్టి తిరస్కరించారు. మొత్తానికి భారత్ విజయాన్ని చారిత్రక వివాదం కప్పివేసింది. దీని ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదు.

Exit mobile version