Site icon HashtagU Telugu

RCB Defeat CSK: మూడు ఓటముల తర్వాత ఆర్సీబీ కి తొలి విజయం

RCB

RCB

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్‌కింగ్స్ కథ ముగిసింది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చెన్నై చేతులెత్తేసింది.
బ్యాటింగ్, బౌలింగ్‌లలో జట్టుగా రాణించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 13 పరుగులు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ మంచి ఆరంభాన్నే ఇచ్చారు. గత మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో మళ్లీ గాడిలో పడినట్లు కనిపించిన విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌లో ఆచితూచి ఆడాడు. 33 బంతుల్లో 30 పరుగులు చేసి ఔటయ్యాడు. డుప్లెసిస్, కోహ్లిలను మొయిన్ అలీ ఔట్ చేయగా… తర్వాత మహిపాల్‌ లోమ్రోర్‌, రజత్‌ పటీదార్‌ నాలుగో వికెట్‌కు 44 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మాక్స్‌వెల్ రనౌటవడంతో బెంగళూరు స్కోర్ వేగం తగ్గింది. అయితే చివరి ఓవర్లో దినేష్‌ కార్తీక్‌ 16 పరుగులు చేయడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 173 పరుగులు చేసింది. కార్తీక్‌ 17 బంతుల్లో 26 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. 19వ ఓవర్లో తీక్షణ కేవలం 3 పరుగులు ఇచ్చిన 3 వికెట్లు తీయడంతో బెంగళూరు భారీస్కోరుకు బ్రేక్ పడింది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో లోమ్రోర్ 27 బంతుల్లో 42 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చెన్నై బౌలర్లలో తీక్షణ 3, మొయిన్‌ అలీ 2 వికెట్లు తీశారు.

174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఓపెనర్లు శుభారంభమే ఇచ్చారు. తొలి వికెట్‌కు 6.4 ఓవర్లలో 54 పరుగులు జోడించారు. అయితే రుతురాజ్ ఔటైన తర్వాత చెన్నై వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. రాబిన్‌ ఉతప్ప (1), అంబటి రాయుడు (10) కూడా ఔటవడంతో చెన్నై 75 రన్స్‌కే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఓపెనర్‌ డెవోన్‌ కాన్వే, మొయిన్‌ అలీ కలిసి నాలుగో వికెట్‌కు 34 రన్స్‌ జోడించారు. ఈ క్రమంలో కాన్వే వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్‌ సెంచరీ చేశాడు. 37 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56 రన్స్‌ చేసి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన మాజీ కెప్టెన్‌ రవీంద్ర జడేజా (3) మరోసారి బ్యాట్‌తో నిరాశపరిచాడు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్ ధోనీ(2) కూడా చేతులెత్తేయడం… మొయిన్ అలీ 27 బంతుల్లో 34 రన్స్ చేసి కీలకమైన సమయంలో ఔటవడంతో చెన్నై ఓటమి ఖాయమైంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది ఏడో ఓటమి. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలు చేజారినట్టేనని చెప్పొచ్చు. మరోవైపు కీలక మ్యాచ్‌లో విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో టాప్ ఫోర్‌లోకి దూసుకొచ్చింది.