Site icon HashtagU Telugu

Shreyas Iyer Shocking Remarks: మా టీమ్ ఎంపికలో సీఈవో పాత్ర.. కేకేఆర్ కెప్టెన్ వ్యాఖ్యలపై దుమారం!!

Shreyas Iyer

Shreyas Iyer

ముంబైతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అద్బుతంగా పోరాడిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) విజయం సొంతం చేసుకుంది. 52 పరుగులతో సూపర్ విక్టరీ నమోదు చేసి, ఐపీఎల్ లో ప్లే ఆఫ్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లే ఆఫ్‌ అవకాశాలు గల్లంతయ్యే ప్రమాదం ఉన్న సమయంలో కేకేఆర్‌ పుంజుకుని కీలక విజయాన్ని అందుకుంది. మ్యాచ్ గెలిచిన అనంతరం కేకేఆర్‌ కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌ మాట్లాడుతూ.. ” కీలక సమయంలో విజయం సాధించడం కాస్త ఊపిరినిచ్చింది. వరుసగా ఐదు పరాజయాలు మమ్మల్ని బాగా కుంగదీశాయి. తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఈ మ్యాచ్‌ ఆడడం లేదంటూ ఆటగాళ్లకు స్వయంగా చెప్పడం బాధ కలిగించేది. కొన్నిసార్లు తుది జట్టు ఎంపికలో జట్టు సీఈవో వెంకీ మైసూర్‌ కూడా ఇన్వాల్వ్‌ అయ్యాడు. జట్టు ఎంపికలో అతనిచ్చిన సలహాలు కూడా మాకు ఉపయోగపడ్డాయి’ అని తెలిపారు. ఈనేపథ్యంలో క్రికెట్ పై పూర్తి అవగాహన లేని సీఈవో సలహాలతో జట్టులో క్రీడాకారులను ఎంపిక చేశారా ? అంటూ వాడివేడి చర్చ మొదలైంది. దీనివల్ల కేకేఆర్ టీమ్ కెప్టెన్, కోచ్ ల పరిధికి విఘాతం కలుగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సీజన్‌ ఆరంభంలో మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో శ్రేయస్‌ అయ్యర్‌ సేన బలంగా కనిపించింది. కానీ ఆ తర్వాతే పరిస్థితి పూర్తిగా రివర్స్‌ అయింది. సీఈవో వెంకీ మైసూర్‌ సలహాలను కెప్టెన్, కోచ్ వినడం వల్లే జట్టు ఎంపికలో లోపాలు జరిగాయని, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎవరు రావాలనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని అంటున్నారు. సీఈవో సూచనల్లో భాగంగానే జట్టు సమతుల్యత దెబ్బతినేలా ప్రయోగాలు చేసి, ఐదు వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి కేకేఆర్ పడిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీజన్‌లో 10 మ్యాచ్‌లు ముగిసేసరికి మూడు విజయాలు.. ఏడు ఓటములతో కేకేఆర్‌ ప్లే ఆఫ్‌ రేసు నుంచి నిష్క్రమించినట్లే కనిపించింది. తాజాగా ముంబైతో జరిగిన మ్యాచ్ లో గెలవడంతో కేకేఆర్‌ జట్టుకు మళ్లీ ఆశలు రేకెత్తాయి. ‘ ప్రస్తుతం జట్టుపై ఒక కూర్పు వచ్చింది. ఇకపై మార్పులు ఉండకపోవచ్చు’ అని కేకేఆర్‌ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ చేసిన కామెంట్స్ కొంటు ఆశాజనకంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.