Yashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అదరగొట్టాడు. విశాఖ వేదికగా వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శతకం సాధించాడు. సహచరులు వెనుదిరిగినా పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాడు. తొలిరోజు ఆటలో జైశ్వాల్ సెంచరీనే హైలైట్. ఇంగ్లాండ్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచిన జైశ్వాల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ బాదాడు. సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ సిక్సర్‌తో అందుకోవడం మరో హైలైట్. యశస్వి సెంచరీకి ఫిదా అయిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చప్పట్లతో అతనికి అభినందనలు తెలిపాడు. జోరూట్ సైతం యశస్విని ప్రత్యేకంగా అభినందించాడు. ఇప్పటివరకు యశస్వీజైశ్వాల్ ఆరు టెస్టులు ఆడగా రెండు సెంచరీలు సాధించాడు.
ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. 2023-25 వరల్ట్ టెస్టు ఛాంపియన్ షిప్‌లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో 500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత, ఆసియా ప్లేయర్‌గా రికార్డు అందుకున్నాడు. ఇక 6 టెస్ట్‌ల్లోనే 55.67 సగటుతో 500 పరుగుల మైలురాయి అందుకున్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. దీనితో పాటు 23 ఏళ్ల వయసులో స్వదేశంతో పాటు విదేశాల్లో శతకం బాదిన ఆటగాడిగా యశస్వి.. దిగ్గజాల సరసన నిలిచాడు. రవి శాస్త్రి, సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ, యశస్వి జైస్వాల్ 23 ఏళ్ల వయసులో స్వదేశంతో పాటు విదేశాల్లో శతకాలు నమోదు చేశారు.
టెస్ట్ ఫార్మాట్‌లో భారీస్కోరుకు పునాది వేయాలంటే భాగస్వామ్యాలే కీలకం. రెండో టెస్టులో జైశ్వాల్ ఐదుగురు బ్యాటర్లతో 40కి పైగా పార్టనర్‌షిప్స్ నమోదు చేయడం కీలకంగా చెప్పొచ్చు. దీంతో తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ 6 వికెట్లకు 336 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే సెహ్వాగ్ స్టైల్‌లో సిక్సర్‌తో సెంచరీ సాధించిన జైశ్వాల్‌కు నెట్టింట్లో ప్రశంసలు వెల్లువెత్తాయి.