Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్ (Commonwealth Games) నిర్వహణ కోసం బిడ్ వేయాలని భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ మేరకు ఆమోదం లభించింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సమర్పించిన ఈ ప్రతిపాదనతో 2030 కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణ హక్కుల కోసం భారత్ ఇప్పుడు అధికారికంగా పోటీపడనుంది.
గుజరాత్‌కు ఆర్థిక సాయం
గేమ్స్ నిర్వహణ కోసం బిడ్ గెలిస్తే అందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయడానికి వీలుగా గుజరాత్ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం (గ్రాంట్-ఇన్-ఎయిడ్) అందించడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిధులు హోస్ట్ కొలాబరేషన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి ఉపయోగపడతాయి. 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తే 72 దేశాల నుంచి క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక అధికారులు, అభిమానులు, మీడియా ప్రతినిధులు భారత్‌కు రానున్నారు. దీనివల్ల స్థానిక వ్యాపారాలు పుంజుకోవడంతో పాటు ప్రజలకు ఆదాయం కూడా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Also Read: Retire From IPL: అశ్విన్ తర్వాత ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే క్రికెటర్లు వీరేనా!
అహ్మదాబాద్‌లో నిర్వహణ?
కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ తొలి ప్రాధాన్యతగా ఉంది. ఈ నగరం ఇప్పటికే ప్రపంచ స్థాయి సౌకర్యాలు, మౌలిక వసతులను కలిగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియం గతంలో 2023 ఐసీసీ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌ను విజయవంతంగా నిర్వహించింది. అహ్మదాబాద్ వంటి నగరంలో ఈ మెగా ఈవెంట్ నిర్వహించడం వల్ల దేశంలో పర్యాటకం గణనీయంగా పెరుగుతుందని, అదే విధంగా భారత యువ క్రీడాకారులకు స్ఫూర్తి లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
భారత్‌లో ఇంతకుముందు 2010లో ఢిల్లీలో కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించింది. ఆ తర్వాత పదేళ్లకు మళ్ళీ ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి బిడ్ వేయడం, అంతర్జాతీయ స్థాయిలో భారత్ తన క్రీడా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించబడుతోంది. ఈ నిర్ణయం దేశ క్రీడా రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.