హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో భార‌త్ జ‌ట్టు 2026 టీ20 ప్రపంచ కప్ గెలవగలదా?

బౌలింగ్ సమతుల్యత, ఫీల్డింగ్ సామర్థ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జట్టుపై ఉన్న 'నమ్మకం' భారత్‌కు అతిపెద్ద ఆయుధంగా మారవచ్చు.

Published By: HashtagU Telugu Desk
Harmanpreet Kaur

Harmanpreet Kaur

Team India: 2025లో తొలిసారి ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా, ఇప్పుడు అదే ఆత్మవిశ్వాసంతో 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌ బరిలోకి దిగనుంది. ఆ విజయం ముఖ్యంగా హై-ప్రెషర్ మ్యాచ్‌లలో భారత జట్టు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై జెమిమా రోడ్రిగ్స్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్, ఫైనల్‌లో షెఫాలీ వర్మ ఆల్ రౌండ్ ప్రదర్శన భారత జట్టు డెప్త్‌ను మరోసారి నిరూపించాయి. యువ బౌలర్లు క్రాంతి గౌడ్, శ్రీ చరణి కూడా తాము పెద్ద వేదికలపై రాణించగలమని నిరూపించగా, బ్యాటింగ్ యూనిట్ టోర్నమెంట్ అంతటా నిలకడగా రాణించింది.

టీ20 ఫార్మాట్ సవాళ్లు

50 ఓవర్ల ఫార్మాట్‌లో విజయం సాధించినంత మాత్రాన టీ20 క్రికెట్‌లో కూడా ఆధిపత్యం చెలాయిస్తామని గ్యారెంటీ లేదు. చిన్న ఫార్మాట్‌లో అనిశ్చితి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక్క బ్యాడ్ డే చాలు ఎంతటి బలమైన జట్టునైనా దెబ్బతీయడానికి. శ్రీలంకపై భారత్ ఇటీవలే 5-0తో సిరీస్ గెలిచినప్పటికీ ప్రత్యర్థి జట్టు నాణ్యత తక్కువగా ఉండటం, భారత ప్రదర్శనలో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపించడం గమనార్హం.

Also Read: ఏపీ ప్రజలకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ న్యూ ఇయర్ గిఫ్ట్..

వికెట్లు తీసే సామర్థ్యంపై ఆందోళన

టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌లో భారత బౌలింగ్ అటాక్ ప్రధాన ఆందోళనగా మారింది. మన బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంలో తడబడుతున్నారు. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో కూడా భారత్ ప్రత్యర్థి జట్టును ఒక్క మ్యాచ్‌లోనూ ఆలౌట్ చేయలేకపోయింది. స్పిన్నర్లు వికెట్లు తీయడంలో ముందున్నప్పటికీ పేస్ అటాక్‌లో పదును తగ్గడం బలమైన జట్లపై ఆడేటప్పుడు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

స్పెషలిస్ట్ లెగ్ స్పిన్నర్ లేకపోవడం

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జట్టులో నిలకడైన లెగ్ స్పిన్నర్ లేకపోవడం. పూనమ్ యాదవ్ తర్వాత భారత్ ఎక్కువగా ఎడమచేతి వాటం స్పిన్నర్లపైనే ఆధారపడుతోంది. దీనివల్ల బౌలింగ్‌లో వైవిధ్యం తగ్గిపోయింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఈ అసమతుల్యత ఇంకా తొలగిపోలేదు.

నమ్మకమే అతిపెద్ద ఆయుధం

బౌలింగ్ సమతుల్యత, ఫీల్డింగ్ సామర్థ్యంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ జట్టుపై ఉన్న ‘నమ్మకం’ భారత్‌కు అతిపెద్ద ఆయుధంగా మారవచ్చు. 2025లో చూపిన అదే ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ద, క్షిణాఫ్రికా వంటి అగ్రశ్రేణి జట్లను ధీటుగా ఎదుర్కొంటే 2026 టీ20 ప్రపంచ కప్ గెలవడం భారత్‌కు అసాధ్యమేమీ కాదు.

  Last Updated: 01 Jan 2026, 03:25 PM IST