Site icon HashtagU Telugu

Sunrisers Playoff: సన్‌రైజర్స్ ప్లే ఆఫ్ చేరాలంటే…?

sunrisers

sunrisers

ఐపీఎల్ 2022 సీజన్‌ని రెండు ఓటములతో ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి అదరగొట్టింది. ఒక దశలో వరుస విజయాలు సాధించి టాప్‌లో నిలిచేలా కనిపించిన హైదరాబాద్ జట్టు గత నాలుగు మ్యాచ్‌లు ఓటమిపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్‌ చేరాలంటే సన్ రైజర్స్ జట్టులో కీలక ఆటగాళ్లు రాణించాల్సిన అవసరముంది. ముఖ్యంగా గాయాల కారణంగా కీలక బౌలర్లు హైదరాబాద్ జట్టుకి దూరమవుతున్నారు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ నటరాజన్ మోకాలి గాయంతో టీమ్‌కి దూరమవగా.. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మళ్లీ గాయపడ్డాడు.

డెత్‌ ఓవర్లలో యార్కర్లతో విజృంభించే నటరాజన్ తిరిగి జట్టులోకి రావాల్సిన అవసరముంది. రాబోయే మ్యాచ్‌ల్లో నటరాజన్‌కు తోడు భువనేశ్వర్‌ కూడా వికెట్లు సాధిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. ఇక ఐపీఎల్‌లోనే ఫాస్టెస్ట్ బౌలర్‌గా ఉన్న ఉమ్రాన్ మాలిక్ గత 2 మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చేశాడు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇలాగే బౌలింగ్‌ చేస్తే జట్టుకు కష్టాలు తప్పవు. ఈ క్రమంలో ఉమ్రాన్ సాధ్యమైనంత త్వరగా లయ అందుకోవాలి. అలాగే సన్ రైజర్స్ బ్యాటింగ్‌‌లో విభాగంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్ తేలిపోతున్నాడు. ఇప్పుడు మిగతా జట్లతో భారీ పోటీ ఉంది కాబట్టి తప్పక రాణించాల్సిన అవసరముంది.

ఇదిలాఉంటే.. ఐపీఎల్ 15వ సీజన్‌లో ఇప్పటికే 11 మ్యాచ్‌లాడిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించి .. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. లీగ్ దశలో హైదరాబాద్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉండగా.. ​ ఆ మూడు మ్యాచ్​లు గెలిచినా నెట్​ రన్​రేట్​తో పాటు ఇతర జట్ల గెలుపోటములపై ఆధారపడాల్సి ఉంటుంది. సన్ రైజర్స్ జట్టు ప్లే ఆఫ్స్​ చేరాలంటే నాలుగో స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మిగాతా రెండు మ్యాచుల్లో దారుణంగా ఓటమిపాలవ్వాలి. అలాగే సన్​రైజర్స్​ మిగతా మూడు మ్యాచ్​లను మెరుగైన రన్​రేట్​తో విజయం సాధించాలి. అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్​ జట్టుకు ప్లే ఆప్స్ కు చేరే అవకాశం ఉంటుంది.

Exit mobile version