ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఈ సీజన్ లో ఇప్పటికే 8 మ్యాచ్‌లాడిన చెన్నై సూపర్ కింగ్స్ కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించడం ద్వారా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. మే 22 వరకూ ఐపీఎల్ 15వ సీజన్ లీగ్ దశ మ్యాచ్‌లు జరగనుండగా అప్పటికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టనున్నాయి….ఇక ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఐపీఎల్-2022లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుందా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఇంతకుముందు చాలా సార్లు వరుస పరాజయాలు ఎదురైనప్పటికి చెన్నై జట్టు పడి లేచిన కెరటంలా వరుస విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.. అయితే ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుందని కొంత మంది అభిప్రాయపడుతుండగా… మరి కొంత మంది చెన్నై సూపర్ కింగ్స్ పని అయిపోయింది అని కామెంట్లు చేస్తున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో మరో 6 లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ 6 మ్యాచ్‌ల్లో 6 మ్యాచ్‌లు విజయం సాధిస్తానే ఎల్లో ఆర్మీ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అయితే చెన్నై జట్టు మరో ఓటమి చవిచూస్తే.. మాత్రం వారి ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. కానీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం అనేది కష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగినప్పటికీ ఆ స్థాయి ప్రదర్శన ఇప్పటివరకూ కనబరచలేదు. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచులు కాకుండా 5మ్యాచ్‌లు గెలిస్తే కూడా ఒకరకంగా ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అపుడు నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుతం చెన్నై నెట్ రన్ రేట్ తక్కువగా ఉన్న కారణముగా ఈ 5 మ్యాచ్‌లు కూడా భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అలాగే టోర్నీలో ఉన్న ఇతర జట్ల గెలుపోటములు కూడా చెన్నై జట్టు ప్లేఆఫ్ అవకాశాలను ప్రభావితం చేస్తాయని చెప్పొచ్చు.