ODI World Cup: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వన్డే ప్రపంచ కప్ (ODI World Cup) అక్టోబర్ లో భారత్ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది. సొంత గడ్డపై టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే పలువురు సీనియర్ ఆటగాళ్ళ గాయాలు భారత్ కు ఆందోళన కలిగిస్తున్నాయి. కె ఎల్ రాహుల్, రిషబ్ పంత్, బూమ్రా వంటి ప్లేయర్స్ మెగా ఈవెంట్ సమయానికి కోలుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యంగా బూమ్రా లాంటి స్టార్ పేసర్ జట్టులో ఉండాల్సిందే. గత ఏడాది నుంచీ గాయం నుంచి కోలుకుని మళ్లీ ఫిట్ నెస్ సమస్యలతో ఆటకు దూరమయ్యాడు. ఈ నేపద్యంలో బూమ్రా (Bumrah) వన్డే ప్రపంచ కప్ ఆడతాడా అనే డౌట్ అందరినీ వేధిస్తోంది.
తాజాగా భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. బుమ్రా విషయంలో కీలక అప్‌డేట్ ఇచ్చాడు. అతను ఖచ్చితంగా ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ప్రస్తుతం ఫిట్ నెస్ సాధించే విషయంలో దృష్టి పెట్టాడని తెలిపాడు. తాము కచ్చితంగా బుమ్రాను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనీ, కుదిరితే ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఫిట్‌గా ఉంటే ఆడతాడనీ చెప్పాడు. అయితే జట్టును ఎలా ఎంపిక చేస్తారో ఇప్పుడే తెలియదన్నాడు. గతేడాది బుమ్రా విషయంలో తొందరపడిన బీసీసీఐ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో అతన్ని ఆడించడం వల్ల బుమ్రా గాయం తిరగబెట్టింది. దీంతో ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ రెండూ అతను ఆడలేదు. ఆగస్టు నెలలో జరిగే ఐర్లాండ్ టీ20 సిరీసులోనే బుమ్రా పునరాగమనం చేసే అవకాశం ఉంది.
Also Read: Rishabh Pant: రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ చేయలేడా..? బీసీసీఐ అధికారి ఏం చెప్పాడంటే..?
కాగా వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లో భారత్ , ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న భారత్ , పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ పైనా అశ్విన్ స్పందించాడు. ఈ మ్యాచ్ మాత్రం అద్భుతంగా ఉంటుందన్నాడు.
ఇటీవలి కాలంలో ఐసీసీ ఈవెంట్లలో జరిగిన పాకిస్తాన్, ఇండియా మ్యాచ్‌లు చాలా అద్భుతంగా ఉన్నాయనీ , అహ్మదాబాద్‌లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్‌నే చూస్తామని అశ్విన్ చెప్పాడు. భారత్, పాక్ మ్యాచ్ ను ఈ సారి లక్ష మందికి పైగా ఫాన్స్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది.