Indian Bowlers: బూమ్రా, షమీ రికార్డుల మోత

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో భారత పేస్ ద్వయం బూమ్రా, షమీ రికార్డుల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో చెరొక ఎండ్‌

  • Written By:
  • Publish Date - July 12, 2022 / 10:04 PM IST

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో భారత పేస్ ద్వయం బూమ్రా, షమీ రికార్డుల మోత మోగించారు. ఈ మ్యాచ్‌లో చెరొక ఎండ్‌ నుంచీ ఇంగ్లాండ్‌ను హడలెత్తించిన ఈ జోడీ అరుదైన రికార్డులను అందుకున్నారు. వీరి పేస్ దెబ్బకు ఇంగ్లాండ్ 110 రన్స్‌కే చాపచుట్టేసింది. ఈ మ్యాచ్‌లో బూమ్రా వన్డే క్రికెట్‌లో భారత్‌ తరపున అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే మ్యాచ్‌లో తొలి 10 ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా నిలిచాడు. జేసన్‌ రాయ్‌, బెయిర్ స్టో, జో రూట్‌, లివింగ్‌స్టోన్‌ వికెట్లు తీసుకున్నాడు. ఇంతకముందు 2013లో శ్రీలంకపై భువనేశ్వర్‌ కుమార్‌, 2003లో జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా శ్రీలంకపై జగవల్‌ శ్రీనాథ్‌ తొలి పది ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టారు.

బుమ్రా 7.2 ఓవర్లలో కేవలం 19 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి. వన్డేల్లో అతనికిదే అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు ఇంగ్లండ్‌ గడ్డపై వన్డే మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసుకున్న తొలి భారత బౌలర్‌గానూ బుమ్రా రికార్డు సాధించాడు.
మరోవైపు మహ్మద్‌ షమీ వన్డే క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్ల మార్క్‌ను అందుకున్న మూడో బౌలర్‌గా షమీ రికార్డు సృష్టించాడు. 80 మ్యాచ్‌ల్లో షమీ 150 వికెట్ల మార్క్‌ను అందుకొని అఫ్గన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.

తొలి స్థానంలో ఆస్ట్రేలియా స్టార్‌ మిచెల్‌ స్టార్క్‌ ఉండగా.. రెండో స్థానంలో పాకిస్తాన్‌ మాజీ స్టార్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ (78 మ్యాచ్‌లు) ఉన్నాడు. అయితే భారత్ నుంచి మాత్రం షమీ 150 వికెట్లను అత్యంత వేగంగా అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకముందు అజిత్‌ అగార్కర్‌97 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్‌ అందుకున్నాడు. అటు ఇక బంతుల పరంగా చూస్తే.. 150 వికెట్లను అత్యంత తక్కువ బంతుల్లో అందుకున్న ఐదో బౌలర్‌గా షమీ నిలిచాడు. 150 వికెట్ల మార్క్‌ను అందుకోవడానికి షమీకి 4071 బంతులు అవసరం కాగా.. మిచెల్‌ స్టార్క్‌ 3857 బంతులతో తొలి స్థానంలో ఉన్నాడు.