Bumrah:బంగ్లాపై బుమ్రాకు రెస్ట్? ఫైనల్‌కు అడుగే దూరంలో టీమిండియా

బలాబలాల పరంగా చూస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం టీమిండియాకు పెద్ద సవాలుకాదు. టోర్నీ ఆరంభం నుంచే భారత్ అన్ని జట్లపై ఆధిపత్యం కనబరిచింది.

Published By: HashtagU Telugu Desk
Jaspreet Bumrah

Jaspreet Bumrah

దుబాయ్: (Asia Cup 2025) ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా… ఫైనల్‌కు కేవలం ఒక విజయ దూరంలో నిలిచింది. సూపర్-4 తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించిన భారత్, గురువారం బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లాపై విజయం సాధిస్తే ఫైనల్ టికెట్‌ను దక్కించుకోనుంది.

బలాబలాల పరంగా చూస్తే బంగ్లాదేశ్‌ను ఓడించడం టీమిండియాకు పెద్ద సవాలుకాదు. టోర్నీ ఆరంభం నుంచే భారత్ అన్ని జట్లపై ఆధిపత్యం కనబరిచింది. ఒమన్‌తో తప్ప ఇతర మ్యాచ్‌లన్నీ వన్‌సైడ్‌గా ముగిశాయి. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్‌ ఫామ్‌లో ఉండటంతో భారత్‌కి హమ్ బోల్డ్ ఆరంభాలు లభిస్తున్నాయి. పాక్‌తో మ్యాచ్లో గిల్ రన్‌ఫ్లోకి రావడంతో మరింత ధీమాగా ఉంది.

ఇదిలా ఉండగా, స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫామ్పై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయి, ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఇప్పటివరకు టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో కేవలం 3 వికెట్లే తీశాడు. దీంతో బంగ్లాతో మ్యాచ్‌లో బుమ్రాకు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కింద విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అతని స్థానంలో అర్షదీప్ సింగ్ ఆడే అవకాశం కనిపిస్తోంది.

బౌలింగ్ విభాగంలో స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి కొనసాగనున్నారు. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ స్థానంలో జితేశ్ శర్మకు అవకాశం ఇవ్వొచ్చని టాక్.

ఇక బంగ్లాదేశ్ జట్టును తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. సూపర్-4లో శ్రీలంకపై గెలిచిన ఆ జట్టు సర్‌ప్రైజ్ ఇవ్వగలదు. అయితే కెప్టెన్ లిట్టన్ దాస్ వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. మ్యాచ్ సమయానికి ఆయన లేకపోతే బంగ్లాకు కొంత మైనస్ అవుతుంది.

దుబాయ్ పిచ్ విషయానికొస్తే, ఇక్కడ ఛేజింగ్ జట్లు ఎక్కువగా గెలుస్తున్నాయి. టాస్ మరోసారి కీలక పాత్ర పోషించనుంది.

  Last Updated: 23 Sep 2025, 10:39 PM IST