Site icon HashtagU Telugu

IND vs ENG 5th Test Match : ఇంగ్లండ్ కు అదిరిపోయే ఆరంభం

IND vs WI

IND vs WI

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ (IND vs ENG 5th Test Match) లో భారత జట్టు 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ సీమర్ గస్ ఆట్కిన్సన్ అద్భుతంగా రాణించి 5 వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బకొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 204/6తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా, మరో 20 పరుగుల వ్యవధిలోనే మిగిలిన 4 వికెట్లను కోల్పోయింది. కరుణ్ నాయర్ తన ఓవర్‌నైట్ స్కోరు (52)కు కేవలం 5 పరుగులు మాత్రమే జోడించి జోష్ టంగ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు చేయగా, రవీంద్ర జడేజా (9) నిరాశపరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆట్కిన్సన్ 5 వికెట్లు, జోష్ టంగ్ 3 వికెట్లు, క్రిస్ వోక్స్ 1 వికెట్ పడగొట్టారు.

Dharmasthala : 800 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ మంజునాథ స్వామి ఆలయం.. ప్రత్యేకత ఏంటంటే!

అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు జాక్ క్రాలే మరియు బెన్ డకెట్ భారత బౌలర్లపై విరుచుకుపడటంతో ఇంగ్లండ్ స్కోరుబోర్డు చాలా వేగంగా దూసుకుపోయింది. ఈ జోడీ వైట్ బాల్ క్రికెట్ తరహాలో దూకుడుగా ఆడి, కేవలం 10 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. వారి దూకుడైన ఆటతో భారత బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

బుమ్రా గైర్హాజరీలో టీమిండియా పేస్ విభాగం కళతప్పింది. సిరాజ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి పేసర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోరు 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులుగా నమోదైంది. జాక్ క్రాలే 47 పరుగులతో, బెన్ డకెట్ 43 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లకు వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడం సవాలుగా మారింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 224తో పోలిస్తే, ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఇంకా 132 పరుగుల వెనుకబడి ఉంది. ప్రస్తుత బ్యాటింగ్ దూకుడు చూస్తుంటే, ఇంగ్లండ్ త్వరగానే ఆధిక్యాన్ని సాధించే అవకాశం ఉంది. భారత బౌలర్లు త్వరగా వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను కట్టడి చేయకపోతే, ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ కష్టాల్లో పడే అవకాశం ఉంది. భారత బౌలర్లు ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతారో చూడాలి.

Exit mobile version