Team England: టెస్ట్ క్రికెట్ కు సరికొత్త ఊపు తెచ్చిన ఇంగ్లాండ్

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 09:25 PM IST

సంప్రదాయ క్రికెట్ అంటే నిదానంగా బ్యాటింగ్ చేసే బ్యాటర్లనే ఎక్కువగా చూస్తాం… ఎప్పుడో తప్ప బ్యాటర్ స్ట్రైక్ రేట్ కనీసం 50 లేక 60 కూడా దాటని పరిస్థితి. అప్పుడప్పుడూ ఫోర్లు, ఎప్పుడైనా సిక్సర్లు ఇదే సీన్లు కనిపిస్తాయి. అయితే ఇంగ్లాండ్ జట్టు ఈ సంప్రదాయానికి స్వస్తి పలికేసినట్టు కనిపిస్తోంది. టెస్ట్ క్రికెట్ అంటే ఇలానే ఆడాలా… అన్న పరిస్థితికి మార్చేస్తూ వన్డే, టీ ట్వంటీ తరహాలో చెలరేగిపోతోంది.

ఇటీవల న్యూజిలాండ్ పై ఆ జట్టు భారీ లక్ష్యాలను ఛేదించినప్పుడే భారత్ కు ఇలాంటి పరిస్థితి వస్తుందని కొందరు హెచ్చరించారు. అయితే మ్యాచ్ ఆరంభమైన తర్వాత మూడున్నర రోజులు టీమిండియాదే ఆధిపత్యం కనబరిచింది. తొలి ఇన్నింగ్స్ లో బెయిర్ స్టో సెంచరీ చేయకుండా ఇంగ్లాండ్ స్కోర్ కనీసం 150 కూడా దాటేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో 378 పరుగుల టార్గెట్ ను ఇంగ్లీష్ టీమ్ ఛేదిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. పైగా కివీస్ బౌలింగ్ తో పోలిస్తే మన బౌలర్లు నిలకడగా రాణిస్తుండడంతో సిరీస్ విజయం ఖాయంగానే కనిపించింది.

అయితే నాలుగోరోజు నుంచి సీన్ మొత్తం రివర్స్ అయింది. న్యూజిలాండ్ పై భారీ లక్ష్యాలను ఛేదించిన ఇన్నింగ్స్ లు గుర్తు తెచ్చుకున్నారో మరొకటో తెలీదు కానీ ఇంగ్లీష్ ఓపెనర్లు చెలరేగిపోయారు. భారీ టార్గెట్ ఛేదించేటప్పుడు కావాల్సిన పునాదిని అద్భుతంగా నిర్మించారు. ఓపెనర్లతో పాటు మరో వికెట్ చేజారినా…ఇంగ్లాండ్ ఒత్తిడిలో పడలేదు. జో రూట్, బెయిర్ స్టో తమ అనుభవంతో జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

నాలుగోరోజు రెండు సెషన్లలోనూ , చివరి రోజు తొలి సెషన్ లోనూ మన బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. తమ బ్యాటింగ్ తో బెయిర్ స్టో, రూట్ భారత బౌలర్ల కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నట్టే కనిపించింది. బూమ్రాతో సహా ఏ ఒక్కరూ ఈ జోడీని కనీసం ఇబ్బందిపెట్టలేకపోయారు. వీరిద్దరూ చివరి రోజు దాదాపు ప్రతీ ఓవర్ లోనూ బౌండరీ కొట్టారంటే ఏ విధంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్ పై భారీ లక్ష్యాలను ఛేదించడం గాలివాటం కాదని భారత్ పై విజయం ద్వారా మరోసారి నిరూపించింది. అంతేకాదు టెస్ట్ క్రికెట్ ను టీ ట్వంటీ, వన్డే తరహాలో కూడా ఆడుతూ సంప్రదాయ క్రికెట్ కు సరికొత్త ఊపు తీసుకొచ్చింది.