Boxing Federation: బాక్సర్ లవ్లీనా సంచలన ఆరోపణలు.. బీఎఫ్‌ఐ వివరణ

కామన్ వెల్త్ గేమ్స్ కు మూడు రోజుల ముందు భారత బాక్సింగ్ లో కలకలం రేగింది.

  • Written By:
  • Publish Date - July 26, 2022 / 10:07 AM IST

కామన్ వెల్త్ గేమ్స్ కు మూడు రోజుల ముందు భారత బాక్సింగ్ లో కలకలం రేగింది. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) అధికారులపై టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ సంచలన ఆరోపణలు చేసింది. బీఎఫ్‌ఐ అధికారులు..
తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని ట్విటర్‌ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించింది. తాను ఒలింపిక్ పతకం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన కోచ్‌ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని, మరో కోచ్ రఫేల్ బెర్గమొస్కోను ఇండియాకు పంపించేశారని ఆమె వాపోయింది. రాజకీయాల వల్ల వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తనకు నష్టం జరిగిందని, ఇప్పుడు కామన్వెల్త్‌ గేమ్స్‌లో అలా జరగకూడదని తాను కోరుకుంటున్నట్లు చెప్పింది. ఈసారి గేమ్స్‌లో ఆమె 70 కేజీల కేటగిరీలో పాల్గొంటోంది. గేమ్స్‌ దగ్గర పడుతున్న సమయంలో తన ట్రైనింగ్‌ చాలా దెబ్బతిన్నదని ఆమె వాపోయింది. ట్విటర్‌లో ఆమె షేర్‌ చేసిన నోట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

నన్ను హింసిస్తున్నారని ఇవాళ చాలా బాధతో చెబుతున్నాను. నేను ఒలింపిక్‌ మెడల్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన కోచ్‌లను తొలగించారు. దీంతో నా ట్రైనింగ్‌ ప్రక్రియ దెబ్బతిన్నది. ఇద్దరు కోచ్‌లలో ఒకరైన సంధ్యా గురూంగ్జీ ద్రోణాచార్య అవార్డు గ్రహీత. నా ఇద్దరు కోచ్‌లను ట్రైనింగ్‌ క్యాంప్‌లో భాగం చేయాలని ఎంతో వేడుకున్న తర్వాతగానీ చేర్చలేదు. వాళ్లను చాలా ఆలస్యంగా చేర్చారని లవ్లీనా ఆరోపించింది. బీఎఫ్‌ఐ ఎన్ని నీచ రాజకీయాలు చేసినా తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతానని ఆశాభావం వ్యక్తం చేసింది.

మరోవైపు దీనిపై బీఎఫ్ఐ వివరణ ఇచ్చింది. లవ్లీనా కోచ్ సంధ్యా గురుంగ్‌కు హోటల్‌లో డెలిగేట్ అకామడేషన్, ట్రాన్స్ పోర్ట్ కల్పించినట్లు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సోమవారం స్పష్టం చేసింది.బర్మింగ్ హామ్ కామన్ వెల్త్ గేమ్స్‌లో కంటెంజెంట్‌కు సహాయక సిబ్బంది విషయంలో పరిమితులున్నాయనే విషయాన్ని కూడా బీఎఫ్ఐ ప్రస్తావించింది. కాగా మరో మూడు రోజుల్లో కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లవ్లీనా ఆరోపణలు క్రీడా వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.