Site icon HashtagU Telugu

IPL 2023: హ్యాట్రిక్‌ విజయంపై ఢిల్లీ కన్ను.. సన్‌రైజర్స్‌ గెలుపు బాట పట్టేనా ?

Bottom Placed Delhi Capitals Eye Another Win Over Sunrisers Hyderabad

Bottom Placed Delhi Capitals Eye Another Win Over Sunrisers Hyderabad

IPL 2023 :  ఐపీఎల్ 16వ సీజన్‌లో టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగి వరుస పరాజయాలతో సతమవుతున్న జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్..మినీ వేలం తర్వాత భారీ అంచనాలతో సిద్ధమైన సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటి వరకూ కేవలం రెండే విజయాలు సాధించి ఐదింటిలో ఓడింది. గత మూడు మ్యాచ్‌లలోనూ చెత్త ప్రదర్శనతో హ్యాట్రిక్ ఓటములను మూటగట్టుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్ ఆ జట్టుకు కీలకమే. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. గత మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక చేతులెత్తేసిన సన్‌రైజర్స్ బ్యాటింగ్‌లో గాడిన పడకుంటే గెలుపు బాట పట్టడం కష్టమే. దీనికి తోడు వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్‌రౌండర్ దూరమవడం కూడా ఆ జట్టుకు ఎదురుదెబ్బగానే చెప్పాలి.

బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠీ వరుస వైఫల్యాలు జట్టుకు ఇబ్బందిగా మారాయి. ఇక 13.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ కేవలం ఒక సెంచరీ మాత్రమే సాధించి మిగిలిన మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచాడు. బ్రూక్‌ అంచనాలు అందుకోకుంటే కష్టమే. కెప్టెన్ మర్క్‌రమ్‌ కూడా సత్తా చాటాల్సి ఉంది. వికెట్ కీపర్ క్లాసెన్ పర్వాలేదనిపిస్తుండగా.. మ్యాచ్‌లను ఫినిష్ చేయలేకపోతున్నాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో గాడిన పడితే తప్ప సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ రేసులో నిలవడం కష్టంగానే కనిపిస్తోంది. అటు బౌలింగ్‌లో మాత్రం నిలకడగానే రాణిస్తోంది. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ క్రమంగా ఫామ్ అందుకున్నాడు. అలాగే నటరాజన్, ఉమ్రాన్ మాలిక్‌తో పాటు మార్కో జాన్సెన్‌పైనా అంచనాలున్నాయి. అయితే వాషింగ్టన్ సుందర్ స్థానంలో ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు వరుస పరాజయాల తర్వాత గాడిన పడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పుడు హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫామ్‌లో ఉన్నప్పటకీ అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోతున్నాడు. వార్నర్ మునుపటి దూకుడు ప్రదర్శిస్తే భారీస్కోర్ ఖాయం. అలాగే పృథ్వీ షా పేలవ ఫామ్ నిరాశ^కలిగిస్తుండగా.. అతని స్థానంలో వచ్చిన సాల్ట్ గత మ్యాచ్‌లో డకౌటయ్యాడు. మిడిలార్డర్‌లో మనీశ్ పాండే సత్తా చాటాల్సి ఉండగా..సర్ఫ్‌రాజ్‌ఖాన్, మిఛెల్ మార్ష్‌ కూడా అంచనాలు అందుకోవాల్సి ఉంది. బౌలింగ్‌లో నోర్జే, ఇశాంత్ శర్మ రాణిస్తుండగా.. స్పిన్ విభాగం అక్షర్ పటేల్ కీలకంగా ఉన్నాడు.

కుల్దీప్ యాదవ్ కూడా తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తే సొంతగడ్డపై ఢిల్లీ మరో విజయాన్ని అందుకునే అవకాశముంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన మ్యాచ్‌లలో అంచనాలకు మించి రాణించాల్సిందే. ఇదిలా ఉంటే ఢిల్లీ పిచ్‌ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గత మ్యాచ్‌లలో రెండోసారి బ్యాటింగ్‌కు దిగిన జట్టే గెలుపొందగా.. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ వైపే మొగ్గు చూపుతుందని అంచనా.

Also Read:  Traffic Restrictions: కొత్త సెక్రటేరియట్ ప్రారంభం.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!