Site icon HashtagU Telugu

Journalist Ban :బొరియా మజుందార్ పై రెండేళ్ళ నిషేధం

boria

boria

భారత జట్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించాడన్న ఆరోపణలకు సంబంధించి స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందార్ పై బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమైంది. అతనిపై రెండేళ్ళ పాటు నిషేధం విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇంటర్య్వూ ఇవ్వనందుకు స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ బొరియా మజుందార్‌ తనను బెదిరించాడంటూ గత ఫిబ్రవరిలో సాహా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే సాహా వాట్సప్‌ చాట్‌ను తారుమారు చేసి స్క్రీన్ షాట్లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడని మజుందార్ ఆరోపించాడు.దీంతో సాహా చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపేందుకు.. వైస్‌ ప్రెసిడెంట్‌ రాజీవ్‌ శుక్లా, ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌, అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ప్రభుతేజ్‌ బాటియాలతో బీసీసీఐ ఒక కమిటీని నియమించింది. కాగా గత నెలలో కమిటీ ముందు హాజరైన సాహా, బొరియా మజుందార్‌లు తమ వెర్షన్‌ను వెల్లడించారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు మజుందార్‌ తనను బెదిరించాడని సాహా పేర్కొనగా.. ఇద్దరి వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకున్న విచారణ కమిటి నిజానిజాలు నిగ్గుతేల్చి బీసీసీఐకి తమ నివేదికను సమర్పించింది.
తాజా సమాచారం ప్రకారం సాహా వ్యవహారంలో జర్నలిస్ట్‌ బొరియా మజుందార్‌దే తప్పని తేలడంతో అతనిపై రెండేళ్ల నిషేధం పడే అవకాశం ఉంది. ఈ రెండేళ్ల కాలంలో మజుందార్‌ టీమిండియా ఆటగాళ్లను కలవడం గానీ.. స్వదేశంలో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు వెళ్లడం చేయకూడదు. దీనికి సంబంధించి బోర్డుకు సంబంధించిన అధికారి ఒకరు స్పందించారు. బొరియా వివాదానికి సంబంధించి అన్ని రాష్ట్రాల క్రికెట్‌ బోర్డుకు తెలియజేస్తున్నట్టు తెలిపారు. భారత్‌ స్వదేశంలో ఆడే మ్యాచ్‌లకు మజుందార్‌ను అనుమతించకూడదనీ, అంతేకాదు ఆటగాళ్లను కూడా కలవకూడదనీ, ఎలాంటి ఇంటర్య్వూలు తీసుకోకూడదని చెప్పారు. ఇది రెండేళ్ల పాటు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి విషయాలు త్వరలోనే బీసీసీఐ అధికారికంగా ప్రకటించే అవకాశముందని ఆ అధికారి వెల్లడించారు.