Tilak Varma: బ్లాస్టర్ బ్యాట్స్ మెన్ తిలక్ వర్మ పాలిట దేవదూత ‘సలాం’.. ఎవరు, ఏం చేశారు?

హైదరాబాద్ కు చెందిన IPL సెన్సేషన్ తిలక్ వర్మ (Tilak Varma). సామాన్య కుటుంబానికి చెందిన తిలక్ కు క్రికెట్ లైఫ్ ప్రసాదించిన ఆ సూపర్ కోచ్ పేరు సలాం బైష్!!

  • Written By:
  • Updated On - May 5, 2023 / 03:03 PM IST

Tilak Varma : అందరిలాగే ఆ 11 ఏళ్ళ కుర్రాడు కూడా క్రికెట్ అంటే చెవి కోసుకునే వాడు. ఒకరోజు ఇంటి దగ్గరున్న గ్రౌండ్ లో అతడు తన ఫ్రెండ్స్ తో కలిసి టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడుతున్నాడు . దూరంగా ఒక వ్యక్తి కూర్చొని ఆ మ్యాచ్ ను క్షుణ్ణంగా చూస్తున్నాడు. ఆ కుర్రాడి దుమ్ములేపే బ్యాటింగ్ స్టైల్ ను ఆయన కనురెప్ప కూడా కొట్టకుండా అబ్జర్వ్ చేస్తున్నాడు.

మ్యాచ్ ముగియగానే.. కుర్రాడిని ఆ వ్యక్తి కలిసి నువ్వు ఏ క్రికెట్ క్లబ్‌లో ఆడుతున్నావు అని అడిగాడు. నేను ఎక్కడా ఆడటం లేదు సార్ అని కుర్రాడు బదులిచ్చాడు.. “నో ప్రాబ్లమ్ ఇకపై నువ్వు ఆడతావ్ .. ప్రతి సండే వచ్చి మా క్రికెట్ క్లబ్ లో నువ్వు మ్యాచ్ ఆడొచ్చు” అని కుర్రాడికి ఆ వ్యక్తి సర్ప్రైజ్ గుడ్ న్యూస్ చెప్పాడు. దీంతో ఆ క్షణంలో ఆ కుర్రాడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా అవకాశం అందుకున్న ఆ కుర్రాడు ఇంకెవరో కాదు.. హైదరాబాద్ కు చెందిన ఐపీఎల్ సెన్సేషన్ తిలక్ వర్మ (Tilak Varma). సామాన్య కుటుంబానికి చెందిన తిలక్ వర్మకు క్రికెట్ లైఫ్ ప్రసాదించిన ఆ సూపర్ కోచ్ పేరు సలాం బైష్!! పూర్తి వివరాలు ఇవీ..

భారీ సిక్సర్ తో హాట్ టాపిక్ గా మారాడు..

ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్, ఐపీఎల్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 46 మ్యాచ్‌లు జరిగాయి. మొహాలీలో గత బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన 46వ మ్యాచ్ లో పంజాబ్ ఇచ్చిన రన్స్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్‌ ప్లేయర్ 20 ఏళ్ల తిలక్ వర్మ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్ కొట్టి ముంబై ఇండియన్స్‌ను గెలిపించండి. అప్పటి నుంచి అంతటా తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి ప్రతిచోటా చర్చ జరుగుతోంది. తిలక్ వర్మ త్వరలో నీలిరంగు జెర్సీలో భారత క్రికెట్ జట్టు కోసం ఆడుతాడని కొందరు క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తదుపరి టీమ్ కెప్టెన్‌గా తిలక్‌ను ముంబయి ఇండియన్స్ తీర్చిదిద్దుతొందని ఇంకొందరు
చెబుతున్నారు.

తిలక్ వర్మ (Tilak Varma) తండ్రి ఏమన్నారంటే..

తిలక్ వర్మ ఎడమ చేతి బ్యాట్స్‌మెన్, రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్. ఆయన 2002 నవంబర్ 8న జన్మించాడు. తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు ఒక ఎలక్ట్రీషియన్‌. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. అతను 2018 డిసెంబర్ లో రంజీ ట్రోఫీ (2018–2019)లో తొలిసారి ఆడాడు. 2019 ఫిబ్రవరి లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేశాడు. తిలక్ 2020 సంవత్సరంలో అండర్-19 ప్రపంచకప్‌లో కూడా ఆడాడు. 2020-2021లో విజయ్ హజారే ట్రోఫీలో 2 సెంచరీలు చేశాడు.

ఈ మ్యాచే తిలక్ వర్మ కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది. అతడి ఆటతీరు ముంబై ఇండియన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో 2022లో ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ అతడిని రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పటి నుంచి తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ కోసం బాగా ఆడుతున్నాడు. 2022లో 14 ఐపీఎల్ మ్యాచ్‌లలో 130 స్ట్రైక్ రేట్‌తో తిలక్ 397 పరుగులు సాధించగా.. ఈ ఏడాది కూడా ఇప్పటివరకు 150 స్ట్రయిక్ రేటుతో 8 మ్యాచ్‌ల్లో 248 పరుగులు చేశాడు. తిలక్ ను ఇంత పెద్ద వేదికపైకి తీసుకురావడంలో ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు.. అతని సక్సెస్ వెనుక గ్రేట్ కోచ్ సలామ్ బైష్ కూడా ఉన్నారనేది స్పష్టం.

సలాం భాయ్ లేకుంటే.. మా తిలక్ (Tilak Varma) లేడు : తండ్రి నంబూరి నాగరాజు

కోచ్ సలాం బైష్ సహకారం లేకుండా తన కొడుకు ఇంత దూరం రావడం సాధ్యమయ్యేది కాదని తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు ఎమోషనల్ గా చెప్పారు. ఆనాడు సలాం బైష్ తన కొడుకు ప్రతిభను గుర్తించకుంటే ఈ స్థితికి ఎదిగేవాడు కాదన్నారు. ” ఆరోజులు నేను మర్చిపోలేను..అప్పుడు మా తిలక్ వయసు పదకొండు ఏళ్ళు.. కోచ్ సలాం మా ఇంటికొచ్చి నాతో మాట్లాడారు. మీ తిలక్‌కి మంచి ట్యాలెంట్ ఉంది.. క్రికెట్ లో కోచింగ్ ఇస్తానని చెప్పారు. నేను ఓకే అన్నాను.. మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే కోచ్ సలాం ఇల్లు ఉండేది.

రోజూ సలాం భాయ్ మా ఇంటికొచ్చి తిలక్ వర్మ ను పికప్ చేసుకొని 40 కి.మీ దూరంలో ఉన్న హైదరాబాద్ లింగంపల్లిలో ఉన్న అకాడమీకి తీసుకెళ్లేవారు. కోచింగ్ పూర్తి కాగానే మళ్ళీ తిలక్ ను తీసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్లేవారు. ఏడాదిపాటు ప్రతిరోజూ ఇలాగే సాగింది. ఆ తర్వాత మరోసారి సలాం భాయ్ వచ్చి నన్ను కలిశారు. తిలక్ టైం వేస్ట్ కాకుండా ఉండేందుకుగానూ మీరు ఇంటిని అకాడమీ దగ్గరకు మార్చండి అని సూచించారు. దానికి కూడా నేను ఓకే చెప్పాను.. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో తిలక్ కుటుంబం దగ్గర బ్యాట్ కొనడానికి కూడా డబ్బులు లేవు.. ఆ టైంలో కూడా కోచ్ సలామ్ మాకు ఆర్థిక సహాయం చేశారు” అని తిలక్ వర్మ తండ్రి నంబూరి నాగరాజు గుర్తు చేసుకున్నారు.

దేశం కోసం ట్యాలెంట్ గుర్తించిందుకు సంతోషంగా ఉంది : కోచ్ సలాం బైష్

ఇక కోచ్ సలాం బైష్ స్పందిస్తూ.. ” నేను తిలక్‌ని మొదటిసారి బార్కాస్ మైదాన్‌లో చూశాను. అక్కడ అతను తన స్నేహితులతో కలిసి టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. నువ్వు ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నావ్ అని అడిగాను.. ఎక్కడా కోచింగ్ తీసుకోవట్లేదని తిలక్ అన్నాడు. అప్పుడు నేను అతని తండ్రిని కలిశాను. మా అకాడమీలో చేర్చుకుంటానని చెప్పాను. డబ్బులు లేవని తిలక్ వాళ్ళ నాన్న అన్నారు. దీంతో నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తానని చెప్పాను. మన దేశం కోసం.. ట్యాలెంట్ ఎక్కడున్నా గుర్తించి పైకి తేవడం ప్రతి కోచ్ బాధ్యత. నేను చేసింది కూడా అదే ” అని చెప్పారు.

Also Read:  India vs Pakistan: వన్డే క్రికెట్ ప్రపంచ కప్ లో భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?