Biggest Fights In IPL: ఐపీఎల్ 18వ సీజన్ కోసం సన్నాహాలు (Biggest Fights In IPL) మొదలయ్యాయి. ప్రతి సీజన్ లాగానే వచ్చే సీజన్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కళ్లు చెదిరే సిక్స్‌లు, ఊహకందని క్యాచ్‌లు, బుల్లెట్లను తలపించే బంతులతో ఆటగాళ్ల ప్రదర్శనను చూడాలని ఫ్యాన్స్ ఉవిళ్లూరుతున్నారు. ఇప్పటికే వేలం ముగిసింది. ఏ ఆటగాడు ఏ జట్టుకు ఆటబోతున్నాడు అన్నది కూడా స్పష్టమైంది. సో టోర్నీ మొదలు కావడమే ఆలస్యం. అయితే ఐపీఎల్ లో జరిగే గొడవలు కూడా టోర్నీని మరింత ఉత్తేజకరంగా మారుస్తాయి. ఐపీఎల్ హిస్టరీలో చాలా కాంట్రవర్సీలు చోటు చేసుకున్నాయి.
ఐపీఎల్ తొలి సీజన్ 10వ మ్యాచ్ ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మొహాలీ స్టేడియంలో జరిగింది. పంజాబ్ విజయం తర్వాత, ఓటమితో కలత చెందిన శ్రీశాంత్.. హర్భజన్ సింగ్‌ని హేళన చేశాడు. కోపంతో భజ్జీ శ్రీశాంత్‌ని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్ మైదానంలో ఏడవడం మొదలుపెట్టాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మధ్య మ్యాచ్ సందర్భంగా భజ్జీ, అంబటి రాయుడు మధ్య వాగ్వాదం జరిగింది. రాయుడు ఒక బంతిని మిస్ ఫీల్డ్ చేశాడు, దాని కారణంగా భజ్జీకి కోపం వచ్చి ఎదో కామెంట్ చేశాడు. కోపంతో రాయుడు బజ్జిపైకి వెళ్ళాడు. ఇద్దరూ చాలా కోపంగా ఒకరినొకరు తోసుకున్నారు. చివరకు అంపైర్లు జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగించారు. 2023 లక్నోలో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోహ్లీని లక్నో బౌలర్ నవీన్-ఉల్-హక్ చులకన చేయడంతో వివాదం మొదలైంది. కోహ్లి కూడా అతనికి గట్టిగా బదులిచ్చాడు. అంతకు ముందు మ్యాచ్‌లో లక్నో గెలిచినప్పుడు గంభీర్ చేసిన సంజ్ఞలకు కోహ్లి రియాక్ట్ ఇవ్వడంతో కాక రేగింది. కోహ్లి, గంభీర్‌కు మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించారు.
Also Read: Bhuvaneshwar Kumar: ఐపీఎల్ లో 200 వికెట్ల క్లబ్ లోకి భువనేశ్వర్
2014లో ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్, మిచెల్ స్టార్క్ మధ్య గొడవ జరిగింది. స్టార్క్ బౌలింగ్ చేసే ముందు ఎదో కామెంట్ చేశాడు. పొలార్డ్‌కు కోపం వచ్చి ఆ బంతిని ఆడకుండా పక్కకు వైదొలిగాడు. కానీ స్టార్క్ బంతిని విసరడంతో పొలార్డ్ కోపంతో బ్యాట్ విసిరాడు. లక్కీగా ఆ బ్యాట్ ఎవరికీ తగలలేదు. దీంతో క్రిస్ గేల్, కోహ్లీ కల్పించుకుని గొడవను ఆపారు. ఐపీఎల్ 12వ సీజన్ 25వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ మొదట చివరి ఓవర్‌లో నో బాల్ ఇచ్చి ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్నాడు. ఇది చూసిన ధోనీ డగౌట్ నుంచి నేరుగా మైదానానికి వచ్చి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో మ్యాచ్ ఫీజులో ధోనీకి 50% జరిమానా విధించారు. ఐపీఎల్‌లో ఉత్కంఠతో పాటు గెలవాలనే ఒత్తిడి కూడా ఆటగాళ్లపై ఉంటుంది. కొన్నిసార్లు ఈ ఒత్తిడి కోపంగా మారుతుంది. అయితే ఈ వివాదాలు ఉన్నప్పటికీ ఐపీఎల్ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తుంది. ప్రతి సీజన్‌లో కొత్త జ్ఞాపకాలను మిగులుస్తుంది.