Mega Finals: కప్పు కొట్టేదేవరో ?

ఐపీఎల్ 15వ సీజన్‌ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి.

  • Written By:
  • Publish Date - May 29, 2022 / 01:25 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. లీగ్ స్టేజ్‌ను మొదటి రెండు స్థానాల్లో పూర్తి చేసిన ఈ రెండు జట్ల మధ్య మరో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది. లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్ వరుస విజయాలు సాధించింది. లీగ్ దశను అగ్రస్థానంలో ముగించిన ఆ జట్టు తొలి క్వాలిఫైయర్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు దూసుకొచ్చింది. లీగ్ స్టేజ్‌లో 14 మ్యాచ్‌లకు గానూ 10 విజయాలు అందుకున్న గుజరాత్‌ను కెప్టెన్ హార్ఠిక్ పాండ్యా సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు. పాండ్యా వ్యక్తిగతంగానూ రాణించి ఆకట్టుకున్నాడు. లీగ్ స్టేజ్‌లో గుజరాత్ ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు వంటి బలమైన జట్లను సునాయాసంగా ఓడించింది.
ఎక్కువ మంది మ్యాచ్ విన్నర్లు ఉండడం గుజరాత్‌కు అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు. సాహా, గిల్, పాండ్యా, మిల్లర్, తెవాటియా వంటి ప్లేయర్స్‌ గుజరాత్ బ్యాటింగ్‌కు ప్రధాన బలం. గుజరాత్ సాధించిన పలు విజయాల్లో పాండ్యా, మిల్లర్ కీలకపాత్ర పోషించారు. ముఖ్యంగా మిల్లర్ తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. అటు బౌలింగ్‌లో మహ్మద్ షమీ, రషీద్‌ఖాన్ కీ ప్లేయర్స్‌గా చెప్పొచ్చు. క్వాలిఫైయర్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించడం గుజరాత్‌కు మరో సైకాలాజికల్ అడ్వాంటేజ్‌. లీగ్ స్టేజ్‌లో కూడా రాజస్థాన్‌పై గుజరాత్‌దే పైచేయిగా నిలిచింది.
మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌ 13 ఏళ్ళ తర్వాత ఫైనల్లో అడుగుపెట్టింది. 2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ ఆ తర్వాత చాలా సీజన్లలో నిరాశ^పరిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా కప్ కొట్టాలని పట్టుదలగా ఉంది. 15వ సీజన్‌లో విజేతగా నిలవడం ద్వారా తమ తొలి కెప్టెన్, దివంగత షేన్‌వార్న్‌కు ఘననివాళ అర్పించాలని భావిస్తోంది. సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ ప్రధాన బలమంతా బట్లర్‌పైనే ఉంది. ఈ సీజన్‌లో తిరుగులేని ఫామ్‌లో ఉన్న బట్లర్ నాలుగు సెంచరీలతో దుమ్మురేపాడు. ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో బట్లర్‌దే టాప్ ప్లేస్‌. ఫైనల్‌కు ముందే ఆరెంజ్ క్యాప్ ఖాయం చేసుకున్న బట్లర్ తుదిపోరులోనే తన ఫామ్ కంటిన్యూ చేస్తే రాజస్థాన్ టైటిల్ కొట్టినట్టే.
మిగిలిన బ్యాటింగ్‌లో పడిక్కల్, జైశ్వాల్, హెట్‌మెయిర్ , రియాన్ పరాగ్ కీలకంగా చెప్పొచ్చు. అటు బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్ , ప్రసిద్ధ కృష్ణ, మెక్‌కాయ్‌లపై అంచనాలున్నాయి. స్పిన్ త్రయంగా అశ్విన్, చాహల్ కూడా నిలకడగా రాణిస్తుండడంతో రాజస్థాన్‌ను తుది పోరులో ఓడించడం గుజరాత్‌కు అంత సులభం కాకపోవచ్చు. ఇక తుది పోరులో పిచ్‌ పేసర్లకు అనుకూలిస్తుందన్న అంచనాలున్నాయి. అదే సమయంలో బ్యాటర్స్ కాసేపు క్రీజులో కుదురుకుంటే పరుగులు సాధించొచ్చని భావిస్తున్నారు.