Ash Barty Retirement : 25 ఏళ్ళకే రిటైర్మెంట్‌ నిర్ణయం

  • Written By:
  • Publish Date - March 23, 2022 / 10:32 PM IST

వరల్డ్ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ ఆష్లే బార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చింది. 25 ఏళ్ళ బార్టీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఆస్ట్రేలియాకు చెందిన ఈ యువ టెన్నిస్ ప్లేయర్ మూడు గ్రాండ్‌శ్లామ్ టైటిల్స్ గెలుచుకుంది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్ గెలిచిన బార్టీ ఈ ఏడాది ఆస్ట్రేలియాన్ ఓపెన్‌లో కూడా విజేతగా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించిన బార్టీ ఆటకు వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్టు చెప్పింది. తాను తీసుకున్న కఠిన నిర్ణయం వల్ల తన మనసు భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోందనీ, టెన్నిస్‌కు వీడ్కోలు పలుకుతున్నాననే విషయం మీతో ఎలా పంచుకోవాలో అర్థంకాలేదని చెప్పింది. అందుకే తన ఫ్రెండ్‌ సాయం తీసుకున్నానని వెల్లడించింది.తనకు అన్ని రకాల సంతోషాలు అందించిన ఆటకు సదా రుణపడి ఉంటానన్న బార్టీ మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నానంటూ వీడియో పోస్ట్ చేసింది.

 

ఈ ప్రయాణంలో అభిమానులు తనకు అందించిన మధుర జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. ఓ వ్యక్తిగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాననీ, ఆటకు గుడ్‌ బై చెప్పడానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నట్టు చెప్పిన బార్టీ మిగతా కలల్ని కూడా నెరవేర్చుకోవాలని వ్యాఖ్యానించింది. బార్టీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తీవ్ర ఉద్వేగానికి గురైంది. 25 ఏళ్ల వయస్సులోనే, కెరీర్‌లో అత్యుత్తమ స్థితిలో ఉన్న సమయంలో బార్టీ రిటైర్‌మెంట్‌ ప్రకటన అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆమె రిటైర్మెంట్ నిర్ణయం వెనుక బలమైన కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఆష్లే బార్టీ కెరీర్‌లో గెలిచిన మూడు గ్రాండ్ శ్లామ్ టైటిల్స్‌తో పలు అరుదైన రికార్డులను అందుకుంది. 44 ఏళ్ళ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్, 41 ఏళ్ళ తర్వాత వింబుల్డన్ సాధించిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అలాగే మహిళల విభాగంలో ఎక్కువ రోజులు నెంబర్‌ వన్ ర్యాంకులో ఉన్న ప్లేయర్‌గానూ రికార్డులకెక్కింది. గతంలో స్టెఫీ గ్రాఫ్ 186 వారాలు, సెరెనా విలియమ్స్ 186 వారాలు, నవ్రతిలోవా 156 వారాలు అగ్రస్థానంలో కొనసాగితే… బార్టీ 121 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. కాగా బార్టీ రిటైర్మెంట్‌పై పలువురు మాజీ క్రీడాకారులు స్పందించారు. యువ క్రీడాకారిణులకు బార్టీ స్ఫూర్తిగా నిలుస్తుందని, ఆమె భవిష్యత్తు మరింత సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు.