Site icon HashtagU Telugu

Jasprit Bumrah: చివరి టెస్ట్ నుంచీ రోహిత్ ఔట్..కెప్టెన్ ఎవరంటే ?

Jasprit Rohit

Jasprit Rohit

ఊహించిందే జరిగింది…ఇంగ్లాండ్ తో జరగనున్న చివరి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. వార్మప్ మ్యాచ్‌ సమయంలో కరోనా పాజిటివ్‌గా తేలిన అతనికి.. తాజాగా మరోసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా మళ్లీ పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో రోహిత్‌ స్థానంలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కపిల్‌ దేవ్‌ తర్వాత ఇండియన్‌ టీమ్‌కు కెప్టెన్సీ వహిస్తున్న పేస్‌బౌలర్‌ బుమ్రానే.

రోహిత్‌ ఆడకపోతే బుమ్రా లేదా పంత్‌లలో ఒకరికి కెప్టెన్సీ దక్కే అవకాశం ఉందని ముందు నుంచీ భావిస్తున్నారు. చివరికి బోర్డు మాత్రం వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా వైపే మొగ్గు చూపింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నిజానికి రోహిత్ త్వరగానే కోలుకుంటాడని
వార్తలు వచ్చాయి. మ్యాచ్ ఆరంభ సమయానికి క్వారంటైన్ కూడా పూర్తవుతుందని భావించారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షల్లో కూడా పాజిటివ్ రావడంతో మ్యాచ్ కు దూరమవక తప్పలేదు. రోహిత్ ప్రస్తుతం లీస్టర్ షైర్ లోని హోటల్లోనే ఐసోలోలేషన్ లో ఉన్నాడు. పూర్తి జాగ్రతలు తీసుకోవాలని బీసీసీఐ ఆదేశించినా షాపింగ్ అంటూ బయటకు వెళ్లడంతోనే హిట్ మ్యాన్ కరోనా బారిన పడ్డాడని తెలుస్తోంది.ఇదిలా ఉంటే టెస్ట్ మ్యాచ్ కు సంబందించి రోహిత్ స్థానంలో ఓపెనింగ్‌ ఎవరు దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. మయాంక్‌ అగర్వాల్‌ను హుటాహుటిన ఇంగ్లండ్‌కు రప్పించినా.. అతన్ని ఆడించేది అనుమానమే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి పుజారా ఓపెనర్‌గా వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. బ్యాటింగ్‌ లైనప్‌లో పుజారా, గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, విహారీ, రిషబ్‌ పంత్‌ ఉండనున్నారు.