BCCI: ఐపీఎల్ మీడియా రైట్స్… రేస్ నుంచి అమెజాన్ ఔట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. బీసీసీఐ నుంచి స్పాన్లర్ల వరకూ, ఆటగాళ్ళ నుంచి ఫ్రాంచైజీల వరకూ కాసుల వర్షం కురిపించే లీగ్.

  • Written By:
  • Publish Date - June 10, 2022 / 05:16 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. బీసీసీఐ నుంచి స్పాన్లర్ల వరకూ, ఆటగాళ్ళ నుంచి ఫ్రాంచైజీల వరకూ కాసుల వర్షం కురిపించే లీగ్. అందుకే ఈ లీగ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు బడా బడా కార్పొరేట్ కంపెనీలు పోటీపడుతుంటాయి. ఇక మ్యాచ్‌ల ప్రసారం చేసే హక్కుల కోసం ఉండే పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సారి మీడియా రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడుపోనున్నాయి. దాదాపు 50 వేల కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉందని అంచనా. ఇప్పటికే రిలయన్స్, వయాకామ్, ఫేస్‌బుక్, గూగుల్ , అమెజాన్, స్టార్, సోనీ వంటి పలు కార్పొరేట్ దిగ్గజాలు రేసులో నిలిచాయి. ఈ సారి పోటీ ఎక్కువగా ఉండడంతో బీసీసీఐ ఈ-బిడ్డింగ్ నిర్వహించబోతోంది. ఆదివారం జరగనున్న బిడ్డింగ్‌కు ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రేసులో గట్టిపోటీ ఇస్తుందనుకున్న అమెజాన్ సంస్థ బిడ్డింగ్ నుంచి వైదొలిగినట్టు సమాచారం. అమెజాన్‌తో పాటు గూగుల్ ఈ ప్రక్రియ నుంచి తప్పుకున్నాయి. వేలం ప్రక్రియకు ముందు బిడ్స్ వేసిన సంస్థలు బీసీసీఐకి సమర్పించవలసిన టెక్నికల్ బిడ్స్ ఈ రెండు సంస్థలు అందజేయలేదు. దీంతో అమెజాన్, గూగుల్ లు ఈ భారీ డీల్ నుంచి తప్పుకున్నట్టేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

తాజా పరిణామాలతో రిలయన్స్ ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకోవడం లాంఛనమేనని వార్తలు వస్తున్నాయి. అంబానీకి సంబంధించిన వయాకామ్18 రేసులో ముందున్నట్టు సమాచారం. నిన్నటి వరకు అమెజాన్ తో గట్టిపోటీని ఎదుర్కున్న రిలయన్స్ ఇప్పుడు ఆ సంస్థ తప్పుకోవడంతో ఇక లాంఛనమేనని అంచనా వేస్తున్నారు. ఆదివారం జరగనున్న ఈ-బిడ్డింగ్‌కు సంబంధించి బీసీసీఐ టెక్నికల్ బిడ్స్‌ను ఇప్పటికే పరిశీలించింది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ అయిన డిస్నీ స్టార్ తో పాటు, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్వర్క్, టైమ్స్ ఇంటర్నెట్, ఫన్ ఆసియా లు టెక్నికల్ బిడ్స్‌ సమర్పించాయి. టెక్నికల్ బిడ్స్‌లో ఏ సమస్య లేకుండా ఉన్నవాళ్లే ఆదివారం జరగబోయే బిడ్డింగ్ రౌండ్‌లో పాల్గొంటారు. ఇదిలా ఉంటే అమెజాన్ తప్పుకోవడం బీసీసీఐకి భారీ షాక్‌గానే చెప్పొచ్చు. ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా ఈ సారి వేల కోట్ల దాకా ఆర్జించాలని బీసీసీఐ టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే చివరి నిమిషంలో అమెజాన్, గూగుల్ తప్పుకోవడంతో పోటీ కాస్త తగ్గడం, వేలంలో భారీ బిడ్డింగ్ వచ్చే అవకాశంపై ప్రభావం చూపుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా వచ్చే సీజన్‌ నుంచి మ్యాచ్‌ల సంఖ్య పెంచుతున్నట్టు ఇప్పటికే బీసీసీఐ ఆ సంస్థలకు స్పష్టం చేసిన నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈ సారి రికార్డు ధరకు అమ్ముడయ్యే అవకాశముందని తెలుస్తోంది.