Site icon HashtagU Telugu

Asia Cup: పాక్‌తో పోరుకు భారత తుది జట్టు ఇదే

Rohit Sharma

Rohit sHarma

పాక్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది… టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ టోర్నీతో అన్ని జట్లూ తమ ఫైనల్ కాంబినేషన్‌ను సెట్ చేసుకునే అవకాశముంది. ఒకటి రెండు మార్పులు మినహా దాదాపు ఇదే భారత జట్టు వరల్డ్‌కప్‌లోనూ ఆడుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. దీంతో ఫైనల్ ఎలెవన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆసియాకప్‌ ఈ సారి టీ ట్వంటీ ఫార్మేట్‌లో జరగనుండడంతో టోర్నీలో ఆడుతున్న అన్ని జట్లూ తమ కూర్పును పరిశీలించుకోబోతున్నాయి. తుది జట్టుతో పాటు ఆయా స్థానాలకు ఆప్షనల్ ప్లేయర్స్‌ను కూడా ఈ టోర్నీతోనే ఎంచుకునే అవకాశముంది. ఈ క్రమంలో భారత్ కూడా తమ కాంబినేషన్‌పై దృష్టి పెట్టింది. గత కొంత కాలంగా వరల్డ్‌కప్‌కు సరైన ఓపెనింగ్ జోడీని సిద్ధం చేసుకునేందుకు ఇప్పటికే పలు ప్రయోగాలు చేసింది. అయితే ప్రస్తుత ఆసియాకప్‌లో రోహిత్‌కు తోడుగా కెఎల్ రాహుల్ వస్తాడా లేక కోహ్లీని దింపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మిగిలిన బ్యాటింగ్‌ లైనప్‌లో సూర్యకుమార్, రిషబ్ పంత్, హార్థిక్ పాండ్యాలు కీలకం కానున్నారు. పాకిస్థాన్‌ జట్టుతో పోలిస్తే ఫామ్ పరంగానూ, ఇటు కూర్పు పరంగానూ భారత్‌ బలంగా కనిపిస్తోంది. ఏడో స్థానంలో దినేశ్ కార్తీక్ , దీపక్ హుడాలలో ఒకరికే చోటు దక్కుతుంది. అనుభవం, ఇటీవలి ఫామ్‌ ప్రకారం చూస్తే దినేశ్‌ కార్తీక్‌ వైపే మొగ్గుచూపొచ్చు. అదే సమయంలో బౌలింగ్‌ కాంబినేషన్‌ కూడా డీకే ప్లేస్‌ను డిసైడ్ చేయనుంది. ఇక బౌలింగ్ కాంబినేషన్‌లో భువనేశ్వర్‌కు తోడు అర్షదీప్‌సింగ్‌కు అవకాశమివ్చొచ్చు. అటు స్పిన్ విభాగంలో జడేజా, చాహల్‌ కీలకంగా ఉన్నారు. మరోవైపు పాకిస్థాన్ జట్టు బౌలింగ్‌ పరంగా బలంగా ఉందని చెప్పొచ్చు. షాహిన్ అఫ్రిది లాంటి పేసర్ దూరమైనప్పటకీ.. మిగిలిన బౌలర్లు ఫామ్‌లో ఉండడం పాక్‌కు అడ్వాంటేజ్‌. బ్యాటింగ్ పరంగా బాబర్ ఆజామ్‌ పైనే ఆ జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఆడుతోంది ఆసియాకప్ అయినప్పటకీ ఇరు జట్లూ వరల్డ్‌కప్ లక్ష్యంగా తమ కూర్పును సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో ఫైనల్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకున్న ఆటగాళ్ళు ఈ మ్యాచ్‌లో రాణిస్తే వరల్డ్‌కప్‌ టీమ్‌ బెర్త్ సాధించినట్టేనని చెప్పొచ్చు.

భారత తుది జట్టు అంచనా ః
రోహిత్ శర్మ( కెప్టెన్ ), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ), హార్థిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ లేక దీపక్ హుడా, రవీంద్ర జడేదా, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్‌సింగ్, యజ్వేంద్ర చాహల్