2nd T20:రెండో టీ ట్వంటీకి భారత తుది జట్టు ఇదే

ఇంగ్లాండ్ గడ్డపై టీ ట్వంటీ సిరీస్ గెలవడమే లక్ష్యంగా శుభారంభం చేసిన టీమిండియాకు రెండో మ్యాచ్‌కు ముందు కొత్త తలనొప్పి మొదలైంది.

  • Written By:
  • Updated On - July 9, 2022 / 01:07 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై టీ ట్వంటీ సిరీస్ గెలవడమే లక్ష్యంగా శుభారంభం చేసిన టీమిండియాకు రెండో మ్యాచ్‌కు ముందు కొత్త తలనొప్పి మొదలైంది. టెస్ట్ మ్యాచ్‌ బడలికతో తొలి టీ ట్వంటీకి విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా , రిషబ్ పంత్, జస్ప్రీత్ బూమ్రా ఇవాల్టి మ్యాచ్‌కు తిరిగి వచ్చారు. వీరి రాకతో తుది జట్టు ఎంపిక కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రావిడ్‌లకు సవాల్‌గా మారింది. వచ్చే టీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం జట్టు కూర్పుపై ఇప్పటికే దృష్టి పెట్టిన భారత్ యువ ఆటగాళ్ళకు వరుసగా అవకాశాలు ఇస్తూ వస్తోంది.

సౌతాఫ్రికాతో సిరీస్‌కు, ఇటీవల ఐర్లాండ్‌తో సిరీస్‌కు సీనియర్లు లేకపోవడంతో పెద్ద ఇబ్బంది ఎదురుకాలేదు. అయితే ఇంగ్లాండ్ టూర్‌లో రెండో మ్యాచ్‌ నుంచీ వీరంతా అందుబాటులో ఉండడంతో తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారింది. తమకు వచ్చిన అవకాశాలను యువ ఆటగాళ్ళు సద్వినియోగం చేసుకోగా.. సీనియర్ల రాకతో ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రెండో టీ ట్వంటీకి సంబంధించి కోహ్లీపైనే అందరి చూపు ఉంది. ఫామ్‌ కోసం తంటాలు పడుతున్న కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆరంభిస్తాడని భావిస్తున్నారు. అదే జరిగితే ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. వన్‌డౌన్‌లో దీపక్‌హుడా రానుండగా… ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ నాలుగో స్థానంలో వచ్చే అవకాశముంది.

సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా తమ తమ స్థానాల్లోనే బ్యాటింగ్‌కు దిగనుండగా… ఆల్‌రౌండర్‌ జడేజాకు తుది జట్టులో చోటు దక్కడంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ జడేజా వస్తే ఫినిషర్ రోల్ పోషిస్తున్న దినేశ్ కార్తీక్‌ను తప్పిస్తారా అనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న. వచ్చే ప్రపంచకప్‌లో దినేశ్ కార్తీక్ దాదాపుగా చోటు ఖాయం చేసుకున్న వేళ అతన్ని బెంచ్‌కే పరిమితం చేయడం సబబు కాదని చెప్పొచ్చు. బౌలింగ్‌ విషయానికొస్తే భువనేశ్వర్ కుమార్, బూమ్రాలతో పాటు హర్షల్ పటేల్ పేస్ విభాగంలో కొనసాగనున్నారు. అయితే స్పిన్నర్‌గా చాహల్‌వైపే టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపే అవకాశముంది. టీ ట్వంటీ ఫార్మేట్‌లో నిలకడగా రాణించే
చాహల్‌ ఇటీవల ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. మొత్తం మీద నలుగురి ఎంట్రీతో జట్టు ఎంపిక రోహిత్, ద్రావిడ్‌లకు గట్టి పరీక్షే పెట్టింది.

భారత్ తుది జట్టు అంచనా ః
రోహిత్‌శర్మ, కోహ్లీ, దీపక్ హుడా , పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా , జడేజా లేక దినేశ్ కార్తీక్, బూమ్రా, భువనేశ్వర్‌ కుమార్, హర్షల్ పటేల్ , చాహల్