Media Rights: ఐపీఎల్ ప్రసార హక్కులు @ 48,395 కోట్లు

బీసీసీఐ జాక్ పాట్ కొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్ లోనే ఓ లీగ్ మీడియా రైట్స్ అత్యధిక ధర పలికాయి.

  • Written By:
  • Publish Date - June 14, 2022 / 08:24 PM IST

బీసీసీఐ జాక్ పాట్ కొట్టింది. ఐపీఎల్ చరిత్రలోనే కాదు ప్రపంచ క్రికెట్ లోనే ఓ లీగ్ మీడియా రైట్స్ అత్యధిక ధర పలికాయి. వచ్చే అయిదేళ్ల కాలానికీ ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐ అక్షరాలా 48,395 కోట్లు ఆర్జించబోతోంది. స్టార్ ఇండియా టీవీ హక్కులు దక్కించుకోగా…వియా కామ్ 18 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.
టీవీ, డిజిటల్ హక్కులను వేర్వేరు సంస్థలు దక్కించుకున్నాయి. మూడు రోజుల పాటు జ‌రిగిన ఈ -వేలంలో పోటీప‌డి కార్పొరేట్ సంస్థ‌లు హ‌క్కుల ధ‌ర‌ల‌ను పెంచుకుంటూ పోయాయి. ప్యాకేజీ ఏ క్రింద టీవీ హ‌క్కుల‌ను 23575 కోట్ల‌కు స్టార్ సంస్థ ద‌క్కించుకుంది. ఒక్కో మ్యాచ్ కోసం డిస్నీ స్టార్ 57.5 కోట్లు బీసీసీఐకి చెల్లించ‌నుంది. డిజిట‌ల్ హ‌క్కుల‌ను రిల‌య‌న్స్ కు చెందిన వ‌యాకామ్ 18 సంస్థ 20,500 కోట్ల‌కు సొంతం చేసుకుంది. డిజిటల్ లో ఒక్కో మ్యాచ్ కు 50 కోట్లు వెచ్చించ‌నుంది. మొత్తంగా ఒక్కో మ్యాచ్ ద్వారా బీసీసీఐకి 107.5 కోట్ల ఆదాయం రానుంది. 2023 నుండి 27 వ‌ర‌కు మొత్తం ఐదేళ్ల పాటు ఈ ఒప్పందం కొన‌సాగ‌నుంది.. ఈ హ‌క్కుల‌ కోసం బీసీసీఐ 32 వేల కోట్ల‌ను క‌నీస ధ‌ర‌గా పేర్కొన‌గా 48 వేల కోట్ల‌కు అమ్ముడుపోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే ప్యాకేజ్ సీ నాన్ ఎక్స్ క్లూసివ్ హక్కులను వ‌యాకామ్ 18 సంస్థ 3,258 కోట్ల రూపాయలకు దక్కించుకుంది. దీని కోసం ఆ సంస్థ ఒక్కో మ్యాచ్ కూ 33.24 కోట్లు చెల్లించనుంది. ఇక ప్యాకేజ్ డీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ప్రసార హక్కులను వ‌యాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ సంయుక్తంగా దక్కించుకున్నాయి. దీని ద్వారా బీసీసీఐకి 1057 కోట్లు రానుంది. అంటే ఒక్కో మ్యాచ్ కూ 2.6 కోట్లు ఆర్జించనుంది. మొత్తం మీద అంచనాకు తగ్గట్టే ప్రసార హక్కులు రికార్డు ధరలో అమ్ముడవడంతో బీసీసీఐ ఫుల్ ఖుషీగా ఉంది. రానున్న సీజన్లలో మ్యాచ్ ల సంఖ్య పెరగనున్న కారణంగానే ప్రసార హక్కుల కోసం కార్పొరేట్ సంస్థలు భారీగా వెచ్చించాయని చెప్పొచ్చు.