UPT20 League: చాలా కాలంగా భారత క్రికెట్ జట్టుకు దూరమైన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ త్వరలో యూపీ టీ20 లీగ్‌లో కనిపించనున్నాడు. లక్నోలో జరిగిన వేలంలో లక్నో ఫాల్కన్స్ భూవీని 30.25 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ వేలంలో భువనేశ్వర్‌ను కొనుగోలు చేసేందుకు పలు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగగా.. చివరికి లక్నో ఫాల్కన్స్ అతడిని దక్కించుకుంది.
ఈ లీగ్‌లో 6 జట్లు తలపడతాయి, గోరఖ్‌పూర్ లయన్స్, కాన్పూర్ సూపర్ స్టార్స్, నోయిడా సూపర్ కింగ్స్, లక్నో ఫాల్కన్స్, మీరట్ మావెరిక్స్ ఫ్రాంచైజీలు ఈ లీగ్లో పోటీకి దిగుతున్నాయి. కాగా ఈ లీగ్లో భువనేశ్వర్ కుమార్‌తో పాటు ధృవ్ జురెల్, సమీర్ రిజ్వీ, కరణ్ శర్మ, నితీష్ రాణా, ప్రియమ్ గార్గ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు ఆడుతున్నారు. ఇదిలా ఉండగా భువనేశ్వర్ కుమార్ చాలా కాలంగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. 33 ఏళ్ల భువీ ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ అనే పదాన్ని తొలగించాడు. ఇంతకు ముందు భువనేశ్వర్ ఇన్‌స్టా బయోలో ఇండియన్ క్రికెటర్ అని ఉండేది. కానీ ఇటీవల క్రికెటర్ అనే పదాన్ని తొలగించాడు. దీంతో అతని రిటైర్మెంట్ పై వార్తలు వచ్చాయి. అయితే భువీ ఇంకా తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే టీమిండియాలో భువికి చోటు దక్కడం అసాధ్యమనే చెప్పాలి. యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో భువిని బీసీసీఐ పట్టించుకునే అవకాశం లేదు.
భువనేశ్వర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2022 నవంబర్ 22న న్యూజిలాండ్‌తో ఆడాడు. ఇది కూడా టీ20 మ్యాచే. 2018లో తన చివరి టెస్టు, 2022లో చివరి వన్డే ఆడాడు. 21 టెస్టుల్లో 63 వికెట్లు, 121 వన్డేల్లో 141 వికెట్లు, 87 టీ20 మ్యాచుల్లో 90 వికెట్లు పడగొట్టాడు. 2014 నుంచి భువీ సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Also Read: Sanju Samson: అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్న సంజూ శాంసన్