Ind vs Ire: కూనే అనుకుంటే హడలెత్తించింది..

టీ ట్వంటీ ఫార్మాట్ లో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోకూడదనే విషయం మరోసారి రుజువైంది. 225 రన్స్ స్కోర్ చేసి భారీ విజయం ఖాయమనుకున్న దశలో టీమిండియాను ఐర్లాండ్ బెంబేలెత్తించింది.

  • Written By:
  • Publish Date - June 29, 2022 / 09:33 AM IST

టీ ట్వంటీ ఫార్మాట్ లో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోకూడదనే విషయం మరోసారి రుజువైంది. 225 రన్స్ స్కోర్ చేసి భారీ విజయం ఖాయమనుకున్న దశలో టీమిండియాను ఐర్లాండ్ బెంబేలెత్తించింది. ఈ భారీ టార్గెట్ ను దాదాపు చేదించినంత పని చేసింది. ఇంత పెద్ద టార్గెట్ ముందుంచిన హార్దిక్ సేన కేవలం 4 పరుగుల తేడాతో గెలిచిందంటే ఐర్లాండ్ ఏ విధంగా పోరాడిందో అర్థం చేసుకోవచ్చు. చివర్లో భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేయకుంటే ఐర్లాండ్ షాక్ ఇచ్చేది. మొత్తానికి రెండో టీ ట్వంటీ లో అతి కష్టం మీద గెలిచిన టీమిండియా 2-0 తో సీరీస్ కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ త్వరగానే ఇషాన్ కిషన్ వికెట్ చేజార్చుకున్నా…దీపక్ హుడా, సంజూ శాంసన్ మెరుపు బ్యాటింగ్ తో భారీ స్కోరు సాధించింది. ఐర్లాండ్ బౌలర్ల పై విరుచుకుపడిన వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. కెరీర్‌లో నాలుగో టీ ట్వంటీ ఆడుతున్న దీపక్‌ హుడా సెంచరీతో రెచ్చిపోయాడు. కేవలం 55 బాల్స్‌లోనే 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో శతకం సాధించాడు. మరోవైపు శాంసన్‌ కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ చేశాడు. అతడు 42 బాల్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 రన్స్‌ చేసి ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 176 రన్స్‌ జోడించారు. టీ20ల్లో ఇండియా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే బెస్ట్‌ పార్ట్‌నర్‌షిప్‌. చివరి ఓవర్లలో ఇండియన్‌ టీమ్‌ వరుసగా వికెట్లు కోల్పోవడంతో మరింత భారీ స్కోరు చేసే అవకాశం చేజారింది. దినేష్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌ ఇద్దరూ తొలి బంతికే డకౌట్‌ అయ్యారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 225 పరుగులు చేసింది.

భారీ టార్గెట్ ముందున్నా ఐర్లాండ్ ఎక్కడా బెదరలేదు. తొలి ఓవర్ నుంచే ఎటాకింగ్ బ్యాటింగ్ తో చెలరేగిపోయింది. ఓపెనర్లు స్టిర్లింగ్ , కెప్టెన్ బల్బిరిన్ తొలి వికెట్ కు కేవలం 5.4 ఓవర్లలోనే 72 పరుగులు జోడించారు. స్టిర్లింగ్ 18 బంతుల్లో 40 , బల్బిరిన్ 37 బంతుల్లో 60 రన్స్ కు ఔటయ్యాక ఐర్లాండ్ స్కోర్ వేగం తగ్గింది. చివర్లో టెక్టార్, డాక్ రెల్ ధాటిగా ఆడడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. విజయం కోసం ఐర్లాండ్ చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సి ఉండగా… ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2, 3 బంతులకు రెండు ఫోర్లు ఇచ్చినా తర్వాత కట్టడి చేశాడు. దీంతో భారత్ 4 పరుగులు తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. దీపక్ హుడాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్ లో ఓడినప్పటికీ ఐర్లాండ్ పోరాట పటిమ ఆకట్టుకుంది.