క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌!

కేవలం 4 ఓవర్లు వేసిన సోనమ్, కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆయన ధాటికి మయన్మార్ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలింది.

Published By: HashtagU Telugu Desk
Sonam Yeshey

Sonam Yeshey

Sonam Yeshey: క్రికెట్ ప్రపంచంలో ఒకప్పుడు అసాధ్యం అనుకున్న రికార్డులు ఇప్పుడు కనుమరుగవుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భూటాన్ బౌలర్ సోనమ్ యేషే ఊహకందని ప్రదర్శనతో చరిత్ర సృష్టించారు. డిసెంబర్ 26న మయన్మార్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఏకంగా 8 వికెట్లు పడగొట్టి, అంతర్జాతీయ టీ20 చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్లు తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి బౌలర్‌గా నిలిచారు.

అద్భుతమైన స్పెల్.. కుప్పకూలిన మయన్మార్

ప్రస్తుతం మయన్మార్- భూటాన్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. గెలేఫు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన మూడవ టీ20 మ్యాచ్‌లో ఈ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భూటాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127/9 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మయన్మార్‌ను సోనమ్ యేషే తన స్పిన్ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశారు. కేవలం 4 ఓవర్లు వేసిన సోనమ్, కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు పడగొట్టడం విశేషం. ఆయన ధాటికి మయన్మార్ జట్టు కేవలం 45 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భూటాన్ 82 పరుగుల భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, సిరీస్‌ను కూడా 3-0తో కైవసం చేసుకుంది.

Also Read: రూ. లక్ష డిపాజిట్‌పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్‌లో అంటే?!

ఎవరీ సోనమ్ యేషే?

22 ఏళ్ల సోనమ్ యేషే ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్. 2003 డిసెంబర్‌లో జన్మించిన సోనమ్, గతంలో భూటాన్ అండర్-19 జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటివరకు భూటాన్ తరపున 34 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన ఆయన మొత్తం 37 వికెట్లు సాధించారు. గత కొంతకాలంగా నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సోనమ్, తాజా రికార్డుతో ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

అగ్రస్థానంలో సోనమ్

ఈ ప్రదర్శనతో అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో సోనమ్ యేషే అగ్రస్థానానికి చేరుకున్నారు. గతంలో మలేషియాకు చెందిన స్యాజ్రుల్ ఇద్రస్ (7 వికెట్లు), బహ్రెయిన్‌కు చెందిన అలీ దావూద్ (7 వికెట్లు) పేరిట ఉన్న రికార్డులను సోనమ్ తుడిచిపెట్టేశారు. క్రికెట్ ఇంకా ప్రాచుర్యం పొందుతున్న చిన్న దేశాల నుండి ఇలాంటి అద్భుత ప్రతిభ వెలుగులోకి రావడం క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

  Last Updated: 27 Dec 2025, 10:59 PM IST