India vs Leicestershire : టెస్టుకు ముందు టీమిండియా ఫుల్ ప్రాక్టీస్

ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న టీమిండియాకు అక్కడ ఫుల్ ప్రాక్టీస్ లభించింది.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 12:38 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై చారిత్రక సీరీస్ విజయం సాధించాలన్న లక్ష్యంతో ఉన్న టీమిండియాకు అక్కడ ఫుల్ ప్రాక్టీస్ లభించింది. టీమ్ లోని ప్రతీ ఒక్కరూ వార్మప్ మ్యాచ్ లో పూర్తి ప్రాక్టీస్ చేశారు.నాలుగు రోజుల పాటు సాగిన మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్లు అందరికీ ప్రాక్టీస్ దొరికింది.పూజారా అటు ఇండియా తరుపున, ఇటు లీస్టర్‌షైర్ తరుపున బ్యాటింగ్ చేయగా ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రిత్ బుమ్రా ఇరు జట్ల తరపున బౌలింగ్ చేశారు… శుబ్‌మన్ గిల్, హనుమ విహారి అయితే ఒకే ఇన్నింగ్స్‌లో రెండు టీమ్‌ల తరుపున బ్యాటింగ్‌కి వచ్చారు. మొత్తానికి ప్లేయర్లందరికీ కావాల్సినంత ప్రాక్టీస్ ఇచ్చిన వార్మప్ డ్రాగా ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 364 రన్స్ వద్దే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసి లీస్టర్‌షైర్‌కు 367 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లీస్టర్‌షైర్‌ 66 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. లీస్టర్‌ జట్టుకు ఆడిన భారత ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. స్పిన్నర్‌ అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు భారత్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీలతో ఫామ్ లోకి రావడం అభిమానులకు ఆనందాన్ని ఇచ్చింది. అలాగే తెలుగు తేజం కే ఎస్ భరత్ రెండు ఇన్నింగ్స్ లోనూ రాణించడంతో టెస్ట్ మ్యాచ్ కు వికెట్ కీపర్ గా ఎవరిని తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది. కాగా రెండో ఇన్నింగ్స్‌లో కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌ ఒకసారి ఔటైనా కూడా మళ్లీ తర్వాత క్రీజులోకి వచ్చి తాము ఔటైన స్కోరు నుంచే ఇన్నింగ్స్‌ కొనసాగించారు. వాళ్లు ఔటైనా కూడా.. తర్వాత మళ్లీ ఆ ఇద్దరినీ బ్యాటింగ్‌కు దింపాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే కొవిడ్‌ బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు. చివరి టెస్ట్‌లో రోహిత్ ఆడడంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇంగ్లాండ్ తో చివరి టెస్ట్ జులై 1 నుంచి జరగనుంది.