Bengaluru Stampede: జూన్ 4న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బెంగళూరులో ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలుచుకున్న సందర్భంగా జరుపుకున్న వేడుకల్లో లక్షల మంది పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంలో అకస్మాత్తుగా తొక్కిసలాట (Bengaluru Stampede) జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఆర్‌సీబీకి చెందిన నలుగురు అధికారులను జూన్ 6 ఉదయం అరెస్టు చేశారు. ఇప్పుడు ఈ కేసులో కొత్త మలుపు వచ్చింది. కింగ్ కోహ్లీపై ఫిర్యాదు నమోదైంది.
క్రికెటర్ విరాట్ కోహ్లీపై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదును సీనియర్ సామాజిక కార్యకర్త ఎచ్.ఎం. వెంకటేష్ సమర్పించారు. దీనికి స్పందనగా పోలీసులు వివరణ ఇస్తూ.. ఈ ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకుంటామని, ప్రస్తుతం జరుగుతున్న విచారణలో దీనిని పరిశీలిస్తామని తెలిపారు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ వద్ద ఉన్న ట్రోఫీలు ఇవే.. ఆ ఒక్క ఐసీసీ ట్రోఫీ మిస్!
లక్షల మంది సమీకరించారు
జూన్ 3న పంజాబ్ కింగ్స్‌పై ఆర్‌సీబీ అద్భుత ప్రదర్శనతో తమ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. ఐపీఎల్‌లో 17 సంవత్సరాలుగా ట్రోఫీ కరువును ఎదుర్కొంటున్న ఆర్‌సీబీ, ఐపీఎల్ 2025 టైటిల్ గెలుచుకోవడంతో ఈ కరువు ముగిసి, జట్టుకు మొదటి ట్రోఫీ లభించింది. ఈ సంతోషంలో భాగంగా ఆర్‌సీబీ తదుపరి రోజు జూన్ 4న బెంగళూరులో వేడుకలు జరుపాలని నిర్ణయించింది. తమ ఇష్టమైన ఆటగాళ్లు, జట్టును చూసేందుకు బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల సుమారు 3 లక్షల మంది అభిమానులు గుమిగూడారు.
అయితే స్టేడియం సామర్థ్యం 35 వేల వరకు మాత్రమే. ఈ పరిస్థితిలో అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా 30 మందికి పైగా గాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. ఆ తర్వాత ఆర్‌సీబీ కూడా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.